US Elections 2024 Explainer: అమెరికా ప్రెసిడెంట్‌ను ఎలా ఎన్నుకుంటారు?
అమెరికాలో ప్రెసిడెంట్‌ని ఎన్నుకునేది ఎవరు? అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి? డొనల్డ్ ట్రంప్, కమలా హారీస్ మధ్య పోటీ ఎలా జరుగుతుందో చెప్పే వార్తా కథనం ఇది. ఆ ఫుల్ డీటేల్స్ తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Who elects the president and vice president in USA: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం వచ్చేసింది. అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ పోటీలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. అయితే, అమెరికాలో ప్రెసిడెంట్‌ని ఎన్నుకోవడం అనేది అంత ఆషామాషీ ప్రక్రియ కాదు. ఈ తతంగమంతా పోలింగ్ తేదీకి ఏడాది ముందు నుంటే మొదలవుతుంది. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా మొదలవుతుంది? ఎలా పూర్తవుతుంది? పోటీ పడే పార్టీలెన్ని... ఆ పార్టీలు తమ అభ్యర్థులను ఎలా ఎన్నుకుంటాయి? ఓటింగ్ ఎలా ఉంటుంది... ఇలాంటి డిటైల్స్ అన్నీ ఈ డీటేయిల్ స్టోరీలో చూడండి.
నవంబర్ మొదటి మంగళవారమే ఎందుకు?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల విషయంలో ఇప్పటికీ అక్కడ ఒక పాతకాలం నాటి పద్ధతినే అనుసరిస్తున్నారు. అమెరికా ఎంత అభివృద్ధి చెందినా ఆ పాత పద్ధతిని మాత్రం వాళ్లు పక్కనపెట్టలేదు. అదేంటంటే, అధ్యక్ష ఎన్నికలు ప్రతీ నాలుగేళ్లకొకసారి నవంబర్ నెలలో మొదటి సోమవారం తరువాత వచ్చే మొదటి మంగళవారం నా నాడు నిర్వహిస్తారు. అమెరికా కాంగ్రెస్ 1845 లో ఒక బిల్లును ఆమోదించడంతో ఈ సంప్రదాయం మొదలైంది.
అప్పట్లో అమెరికాలో వ్యవసాయమే ప్రధాన ఆదాయ మార్గంగా ఉండేది. ఎక్కువ శాతం జనాభా వ్యవసాయం పైనే ఆధారపడేది. రైతులు మారుమూల ప్రాంతాల్లో ఉంటూ వ్యవసాయం చేసుకునే వారు. పోలింగ్ కేంద్రాలను మాత్రం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసే వాళ్లు. దీంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ఒక రోజంతా ప్రయాణించాల్సి వచ్చేది. అందుకే అందరూ ముందే ప్లాన్ చేసుకునేలా ప్రతీ నాలుగేళ్లకొకసారి నవంబర్ నెలలో మొదటి సోమవారం తరువాత వచ్చే మొదటి మంగళవారమే ఎన్నికలు నిర్వహించే నిబంధన అమలులోకొచ్చింది.
నవంబర్ నెల మొదటివారంలో అక్కడి రైతులకు పెద్దగా పని ఉండదు. అది ఒక పంట చేతికొచ్చిన తరువాత మరో పటం వేయడానికి మధ్య ఉన్న గ్యాప్ అన్నమాట. ఆ గ్యాప్ రైతులకు అనుకూలంగా ఉంటుందని ఆ రోజునే ఖరారు చేస్తూ అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.
ప్రైమరీ, కాకస్ ప్రాసెస్ ఏంటి?
ఎన్నికలు నిర్వహించే ఏడాదిలో మార్చి నెల కంటే ముందుగానే అధ్యక్ష పదవికి పోటీ చేసే వాళ్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద తమ పేరు నమోదు చేసుకోవాలి. మార్చి నుండి మే వరకు అభ్యర్థులు తాము అమెరికా అధ్యక్ష పదవికి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో అందరికీ తెలియజేయాలి. జూన్ నుండి వేసవి కాలం పూర్తయ్యే వరకు అభ్యర్థులు దేశవ్యాప్తంగా ప్రైమరీ, కాకస్ డిబేట్స్ పేరుతో చర్చగోష్టి నిర్వహించి తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అభ్యర్థి విషయంలో స్పష్టత ఉన్నట్లయితే, జనవరి నుండే ఈ ప్రైమరీ, కాకస్ ప్రక్రియ మొదలవుతుంది.
ప్రైమరీ, కాకస్ అనేవి భారత్‌లో జరిగే ఓటింగ్ ప్రక్రియలో కనిపించవు. ప్రైమరీ, కాకస్ అనేవి రాజకీయ పార్టీలు, అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అధ్యక్ష పదవికి పోటీ చేయబోయే తమ అభ్యర్థిని సీక్రెట్ బ్యాలట్ పద్ధతిలో ఎన్నుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే తాము ఎన్నుకున్న అభ్యర్థికి మద్దతుగా కొంతమంది ప్రతినిధులను కేటాయించే ప్రక్రియ కూడా ఈ కాకస్ దశలోనే జరుగుతుంది. సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కాకస్ దశలో రాజకీయ పార్టీలు ఎన్నుకునే ప్రతినిధులు తమ తమ రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్థిని బలపర్చేందుకు పనిచేయాల్సి ఉంటుంది.
అధ్యక్ష పదవికి పోటీ చేసే వాళ్ళకు తొలి పరీక్ష
ఇక్కడే మరో కొత్త పదం వినిపిస్తుంది. అదే నేషనల్ కన్వెన్షన్స్. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోయే వాళ్లకు తొలి సవాలు ఎదురయ్యేది ఇక్కడే. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిని ఎన్నుకునేది ఈ నేషనల్ కన్వెన్షన్ దశలోనే. అంటే తమ సొంత రాజకీయ పార్టీలను అభ్యర్థులు ముందుగా ఇంప్రెస్ చేయాల్సింది ఇక్కడేనన్నమాట. సెప్టెంబర్‌లోగా ఈ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తరువాత అమెరికా అధ్యక్ష పదవి రేసులోకి వచ్చిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా డిబేట్స్ నిర్వహిస్తారు.
సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు అభ్యర్థుల మధ్య పబ్లిక్ డిబేట్స్ జరుగుతాయి. ఈ పబ్లిక్ డిబేట్స్‌లోనే దేశాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం వాళ్లు తీసుకోబోయే నిర్ణయాలు, పాలసీలు, తీసుకురానున్న మార్పులను వివరిస్తారు. అప్పటికే దేశం ఎదుర్కుంటున్న అనేక క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తారు. మిత్రదేశాలతో, శత్రుదేశాలతో తమ వైఖరి ఎలా ఉండబోతుంది, అది అమెరికాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెబుతారు.
ఇండియాలో రాజకీయ పార్టీలు వేర్వేరుగా సభలు పెట్టి, ర్యాలీలు తీసి ఎన్నికల ప్రచారం చేస్తుంటారు. కానీ అమెరికాలో అందుకు భిన్నంగా జరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే అభ్యర్థులు అనేక సందర్భాల్లో ఒకే వేదికలపైకొచ్చి తాము చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. అవసరమైతే ప్రత్యర్థి విసిరిన సవాలుకు అదే వేదికపై జవాబు ఇస్తారు. ఈ డిబేట్స్ ఆధారంగానే అమెరికా ఓటర్లు ఎవరిని అధ్యక్షులుగా ఎన్నుకోవాలనే విషయంలో ఒక నిర్ణయానికొస్తారు. ఈ దశలో ఎన్నికలకు ఇక రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంటుంది.
నవంబర్ మంగళవారం వచ్చేసింది
ముందుగా చెప్పుకున్నట్లుగానే నవంబర్ నెలలో ఫస్ట్ సోమవారం తరువాత వచ్చే ఫస్ట్ మంగళవారం రానే వచ్చేసింది. నవంబర్ 5న జరిగే ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్ తలపడుతున్నారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, ఇమ్మిగ్రేషన్ నుండి ఫారెన్ పాలసీ వరకు అనేక అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.
అధ్యక్షుడిని ఎన్నుకునేది ఎవరు?
నవంబర్ 5న జరిగే ఎన్నికలతో అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ అయిపోలేదు. డిసెంబర్‌లో ఎలక్టోరల్ కాలేజ్ పేరుతో మరో ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్‌లోనే అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌లను ఎన్నుకుంటారు. అమెరికా కాంగ్రెస్‌లో హౌజ్, సెనేట్ రెండూ కలిపి 538 మంది సభ్యులు ఉంటారు. అమెరికా పౌరులకు నేరుగా తమ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం లేదు. అమెరికా కాంగ్రెస్‌లో ఉండే 538 మంది సభ్యులే ప్రెసిడెంట్‌ని, వైస్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారు. ఇక్కడ విజయం సాధించాలంటే అధ్యక్ష పదవికి పోటీ చేసిన వాళ్లకు కనీసం 270 ఓట్లు రావాలి. ఇది అమెరికా అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్.
వాస్తవానికి నవంబర్ 5న ఎన్నికలు ముగిసిన రాత్రి నుండే ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ తరహాలో అమెరికా మీడియాలో కూడా ఈసారి గెలవబోయే అభ్యర్థి ఎవరు అనేది చెబుతుంటారు. కానీ, అదంతా కూడా వారి వద్ద సర్వే డేటా మాత్రమే. అసలు ప్రెసిడెంట్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది తేలేది మాత్రం ఈ ఎలక్టోరల్ కాలేజ్ ప్రక్రియ తరువాతే.
ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణస్వీకారం ఉంటుంది. మరి ఈసారి జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరు? అమెరికాకు 47వ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారా? ఈ విషయం తేలాలంటే ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.