US Elections 2024 first result: అమెరికాలో ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది.. ఆ ఊర్లో అర్ధరాత్రే ఓటింగ్ సంప్రదాయం

Update: 2024-11-05 16:42 GMT

US Elections 2024 first result: అమెరికాలో ఓవైపు అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు ఆ ఊర్లో ఎన్నికల ఫలితం వచ్చేసింది. ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే... అమెరికాలో అంతటా తెల్లవారి 6 గంటలకు, ఇంకొన్ని చోట్ల 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే, ఆ ఊరిలో మాత్రం అర్థరాత్రే పోలింగ్ అయిపోయింది. ఆ తరువాత 12 నిమిషాలకే ఫలితం కూడా ప్రకటించారు. న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్ అనే చిన్న ఊరు గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ ఊరిలో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ముగ్గురు డెమొక్రట్స్ తరపున పోటీ చేసిన కమలా హారీస్‌కు ఓటు వేశారు. మరో ముగ్గురు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌కు ఓటు వేశారు. ఉన్న ఆరుగురు ఓటర్లలో ముగ్గురు అటు, ముగ్గురు ఇటు ఓటు వేయడంతో అక్కడి ఫలితం టై అయింది.

న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనల ప్రకారం, 100 మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్న మునిసిపాలిటీలలో అర్థరాత్రే పోలింగ్ ప్రారంభించుకునే వెసులుబాటు ఉంది. 1960 లో తొలిసారిగా అక్కడ ఇలా అర్ధరాత్రి పోలింగ్ నిర్వహించే సంప్రదాయం మొదలైంది. అమెరికా ఫెడరల్ చట్టాలు, నిబంధనల ప్రకారం పోలింగ్ ముగియగానే కౌంటింగ్ చేపడతారు. అలా ఇక్కడి ఫలితం నిమిషాల్లోనే తేలిపోతుంది. అమెరికా అంతటా తెల్లారాక ఓటేస్తే.. ఇక్కడ మాత్రం అర్ధరాత్రే ఫలితం కూడా తేలిపోతుంది. అందుకే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగే ప్రతీసారి ఇక్కడి ఫలితం వార్తల్లోకెక్కుతుంది.

2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించినప్పుడు కూడా ఈ డిక్స్‌విల్లె నాచ్ ఊరి ఓటింగ్ సరళిపై వార్తలొచ్చాయి. అప్పుడు ఇక్కడున్న ఆరుగురు ఓటర్లు జో బైడెన్‌కే ఓటు వేశారు. కానీ ఈసారి మాత్రం వారి తీర్పులో కమలా హారీస్‌కు, డోనల్డ్ ట్రంప్‌కు చెరో సగం ఇచ్చారు.

Tags:    

Similar News