America About Amit Shah News: అమిత్ షాపై కెనడా ఆరోపణలు.. స్పందించిన అమెరికా
America reacts to Canada allegations against Amit Shah: భారత హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా చేస్తోన్న ఆరోపణలపై అమెరికా స్పందించింది. కెనడా చేస్తోన్న ఆరోపణలు ఆందోళనకరంగా ఉన్నాయని అమెరికా అభిప్రాయపడింది. ఈ విషయంలో పరిస్థితిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి తాము కెనడాతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కెనడాలో ఖలిస్తాన్ నినాదంతో ఉద్యమాలు చేస్తోన్న సిక్కులపై దాడులు చేయించడంలో భారత హోంశాఖ మంత్రి అమిత్ షా పాత్ర ఉందని కెనడా ఆరోపించింది. కెనడా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ది వాషింగ్టన్ పోస్ట్ అనే మీడియా సంస్థ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తానే అమిత్ షా పేరు వెల్లడించానని మోరిసన్ తెలిపారు. కెనడా పార్లమెంటరీ కమిటీ ఎదుట మంగళవారం ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయింది.
ఇప్పటికే కెనడాలో గతేడాది హత్యకు గురైన ఖలిస్తాన్ వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. నిజ్జర్ హత్య కేసుతో భారత దౌత్యవేత్తలకు సంబంధం ఉందని కెనడా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఇలాంటి సమయంలో కెనడాలో భారత దౌత్యవేత్తలకు రక్షణ విషయంలో తాము కెనడా ప్రభుత్వాన్ని నమ్మలేమని భారత్ అభిప్రాయపడింది. అంతేకాకుండా కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలను అక్కడి నుండి వెనక్కి పిలిపించుకుంది. అలాగే ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను కూడా వెనక్కి పంపించింది. దీంతో రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగినట్లయింది.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే తాజాగా కెనడా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఏకంగా అమిత్ షాపైనే ఆరోపణలు గుప్పించారు. దీంతో ఈ వివాదం పతాక స్థాయికి వెళ్లింది. అమిత్ షాపై కెనడా చేసిన ఆరోపణలపై అమెరికా కూడా స్పందించింది. ఇక భారత్ ఏమని స్పందిస్తుందా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.