US Elections: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండించిన డొనాల్డ్ ట్రంప్
US Elections: అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడిని తీవ్రంగా ఖండించారు.
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉంది. దీపావళి సందర్భంగా, జో బిడెన్‌తో సహా వివిధ ప్రపంచ నాయకులు భారతీయ, హిందూ సమాజానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ హిందువులు, మైనారిటీలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ వారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ట్రంప్ ఏం అన్నారంటే?
బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని డొనాల్డ్ ట్రంప్ X పోస్ట్‌లో పేర్కొన్నారు. వారిపై ఆకతాయిలు దాడి చేసి దోచుకుంటున్నారు. నా జీవితకాలంలో ఇలా జరగలేదని ట్రంప్ అన్నారు. కమలా హారిస్, జో బిడెన్‌లు ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోని హిందువులను విస్మరించారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇజ్రాయెల్ నుండి ఉక్రెయిన్ వరకు,అమెరికా దక్షిణ సరిహద్దు వరకు ఉన్న ప్రజలకు ఎన్నో విపత్తులు ఉన్నాయి. అమెరికాను మళ్లీ బలపరుస్తామని,శాంతిని తిరిగి తీసుకువస్తామని ట్రంప్ అన్నారు. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని తెలిపారు.
హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడుతామని..నా పరిపాలనతో ఇండియాతోపాటు నా స్నేహితుడు, ప్రధాని మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటామని తెలిపారు. కమలా హారిస్ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో మీ చిన్న వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయి. నేను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కోత విధిస్తా. అమెరికాను చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తాను. ఇంతకుముందు లేని అమెరికాను అత్యంత శక్తివంతంగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతాను. అమెరికాను మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతాను అని ట్రంప్ అన్నారు.
బంగ్లాదేశ్ లో మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత హిందువులను లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డారు. వారి నివాసాలు, వ్యాపార సంస్థలపై దాడులు చేసి వాటిని తగులబెట్టారు.