Spain: స్పెయిన్ లో ఆకస్మిక వరదలు..కొట్టుకుపోయిన వందలాది కార్లు..పలువురి ఆచూకీ గల్లంతు
Spain: స్పెయిన్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా పలువురు మరణించారు. మరికొందరు ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
Spain: ఆకస్మిక వరదలు స్పెయిన్ ను అతలాకుతలం చేశాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. స్పెయిన్ లోని వాలెన్సియాలో ఆకస్మిక వరదలు సంభవించాయని..ఎంతో మంది మరణించారని ప్రభుత్వ అధికారి కార్లోస్ మజోన్ పేర్కొన్నారు.
సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు దక్షిణ స్పెయిన్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి వీధులన్నీ బురదతో నిండిపోయాయి. వరదల కారణంగా పలువురు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. తప్పిపోయిన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపటినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో స్పెయిన్ కేంద్రం ఓ సంక్షోభ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మంగళవారం సమావేశమై పరిస్థితులను గురించి చర్చించారు. తప్పిపోయిన వ్యక్తులు, తుపాన్ కారణంగా సంభవించిన నష్టం గురించి ఆందోళన చెందుతున్నా..అధికారుల సలహాలు తప్పనిసరిగా ప్రజలు అనుసరించాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇదెలా ఉండగా..రాష్ట్ర వాతావరణ సంస్థ వాలెన్సియా ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
దీంతో సిటీ హాల్ అన్ని పాఠశాల తరగతులు, క్రీడా కార్యక్రమాలను నిలిపివేసినట్లు వెల్లడించారు. 12 విమానాలు దారి మళ్లించడంతోపాటు 10 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు.