Elon Musk, Vladimir Putin Secret Conversations: అమెరికాను దెబ్బ కొట్టేందుకు ఎలాన్ మస్క్ రష్యాతో చేతులు కలుపుతున్నారా? ఈ సందేహం వ్యక్తంచేస్తోంది ఇంకెవరో కాదు.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాతో పాటు అమెరికాలోని డెమెక్రటిక్ పార్టీ నేతలు ఈ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ వివాదం ఏంటో పూర్తిగా తెలియాలంటే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న కొన్ని తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలి.
బిలియనేర్ ఎలాన్ మస్క్ ఇటీవల కాలంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తరచుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు ఇస్తోన్న విషయం తెలిసిందే. ట్రంప్ కోసం ప్రచారం చేస్తోన్న ఎలాన్ మస్క్ రష్యా అధ్యక్షుడితో టచ్‌లో ఉండటం తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని నాసా అడ్మిన్ చీఫ్‌తో పాటు పలువురు డెమొక్రటిక్ పార్టీ నేతలు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు.
నాసా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మొదటిగా ఈ వాదన వినిపించగా తాజాగా ఆ జాబితాలో డెమొక్రటిక్ నేత ఆడమ్ స్మిత్ కూడా చేరారు. అమెరికా దేశ భద్రత దృష్ట్యా ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆడమ్ స్మిత్ పేర్కొన్నారు. అమెరికా రక్షణ శాఖ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆడమ్ స్మిత్ విజ్ఞప్తిచేశారు.
అమెరికా సెనేట్ ఫారెన్ రిలేషన్స్ కమిటీ, సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీలో సభ్యులుగా ఉన్న సెనేటర్ జీన్ షాహీన్ కూడా ఇదే వాదన వినిపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఎలాన్ మస్క్ సంబంధాలపై దర్యాప్తు జరిపించాలని సెనేటర్ జీన్ షాహీన్ రక్షణ శాఖను కోరారు. దేశ భద్రతలో అతి సున్నితమైన అంశాలకు వ్లాదిమిర్ పుతిన్, ఎలాన్ మస్క్ వల్ల సమస్యలు రాకుండా చూడాలని షాహీన్ అభిప్రాయపడ్డారు.
వీళ్ల అనుమానానికి కారణం ఏంటంటే..
2022 నుండి వ్లాదిమిర్ పుతిన్‌తో ఎలాన్ మస్క్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అమెరికాలోని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' మీడియా సంస్థ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త కథనమే నాసా, డెమొక్రటిక్ నేతల అనుమానాలకు కారణమైంది. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున బరిలోకి దిగిన కమలా హ్యారీస్‌ని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారు.
స్పందించిన రష్యా, డొనాల్డ్ ట్రంప్ వర్గాలు
అమెరికా దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఎలాన్ మస్క్ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వస్తోన్న ఆరోపణలను రష్యా, ట్రంప్ వర్గాలు ఖండించాయి. పుతిన్ తరపున ఆయన అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్‌కు, ఎలాన్ మస్క్ ఒకే ఒక్కసారి మాత్రమే ఫోన్ కాల్ మాట్లాడినట్లు తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ తరపున నేషనల్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లీవిట్ మాట్లాడుతు, ఎలాన్ మస్క్ లాంటి ఇండస్ట్రీ లీడర్స్ తరానికి ఒక్కరే ఉంటారని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చాక రష్యా విషయంలో కఠినమైన ఫారెన్ పాలసీతో వ్యవహరిస్తారని కెరొలిన్ స్పష్టంచేశారు. అయితే, అమెరికా దేశ రక్షణ విషయంలో ఈ వివాదం అనేక అనుమానాలకు తావిస్తున్నప్పటికీ.. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాన్ మస్క్ కానీ లేదా అమెరికా రక్షణ శాఖ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
నాసా భయానికి కారణం అదేనా?
అమెరికాలో అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాకు సమాంతరంగా ఎలాన్ మస్క్ తన ప్రైవేట్ సంస్థ అయిన స్పేస్ ఎక్స్ డెవలప్ చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునిత విలియమ్స్, బచ్ విల్మోర్‌లను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కోసం నాసా ఉపయోగించిన స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఎలాన్ మస్క్ కంపెనీ తయారు చేసిందే. ఇలా అంతరిక్ష ప్రయోగాల్లోనూ ఎలాన్ మస్క్ తన సత్తా చాటుకుంటున్నారు.
మరోవైపు అమెరికాకు వ్యతిరేకులుగా ముద్రపడిన వారి జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. అటువంటప్పుడు రష్యాతో సంబంధాలున్న ఎలాన్ మస్క్ భవిష్యత్తులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఇంకేం చేస్తారోననే అనుమాానాలు కొంతమంది అమెరికన్లను వేధిస్తున్నాయి. అందుకే అమెరికా దేశ భద్రత దృష్ట్యా ఈ వివాదంపై విచారణ జరిపించాలని నాసా ఉన్నతాధికారితో పాటు డెమోక్రట్స్ అమెరికా రక్షణ శాఖను కోరుతున్నారు.