Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలు... ఇంకా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా

Bangladesh: బ్రిటన్ నుంచి క్లీయరెన్స్‌ కోసం షేక్ హసీనా ఎదురుచూపులు

Update: 2024-08-07 08:51 GMT

Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలు... ఇంకా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా

Bangladesh: బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో తలెత్తిన రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ పార్లమెంట్ను రద్దు చేశారు. ఈ పరిణామంతో జనవరి 7న జరిగిన బంగ్లాదేశ్12వ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రభుత్వం రద్దై పోయింది. అంతేకాదు.. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. 2018 నుంచి ఆమె అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించారు.

షేక్ హసీనా రాజీనామాతో ఆమె ప్రత్యర్థి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియాకు జైలు నుంచి విముక్తి లభించింది. ఇక.. బంగ్లాదేశ్లో జులై 1 నుంచి ఆగస్టు 5 వరకూ జరిగిన అల్లర్ల కారణంగా అరెస్ట్ చేసిన నిరసనకారులను కూడా విడుదల చేశారు. హసీనా ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్ కోటా విధానంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

ఈ అల్లర్లలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని బంగ్లాదేశ్ స్థానిక మీడియా కథనాలు వివరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేస్తూనే ఉన్నారు. నిరసనకారులు నేరుగా ప్రధాని అధికారిక నివాసంలోకి కూడా ప్రవేశించడంతో.. ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తనకు ఆశ్రయం కల్పించాలని యూకేను షేక్ హసీనా కోరారు. యూకే అనుమతి వచ్చిన వెంటనే ఆమె భారత్ నుంచి అక్కడికి పయనమవుతున్నారని తెలుస్తోంది.

అయితే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారత్ ఆశ్రయం ఇచ్చిన తర్వాత మళ్లీ తమ అవసరం లేదని బ్రిటన్ అంటున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో షేక్ హసీనాకు బ్రిటన్ నుంచి క్లీయరెన్స్ రావడం అంత సులభంగా జరిగే పనేమీ కాదని తెలుస్తోంది. మరో వైపు కల్లోలిత బంగ్లాదేశ్‌కు ఎయిర్ కనెక్టివిటీని పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఎయిరిండియా విమానాలను నడపనుంది. ముందే షెడ్యూల్‌ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. విస్తారా, ఇండిగో సైతం అదే బాటలో పయనించనున్నాయి. ఆ దేశ రాజధాని ఢాకాకు విమానాలు వెళ్తాయని ప్రకటించాయి. మరోవైపు బంగ్లాలో ఉన్న భారతీయులను భారత్‌కు చేర్చేందుకు ఎయిరిండియా బుధవారం ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఎయిరిండియా నిన్న సాయంత్రం ఢాకాకు ఓ విమానాన్ని నడిపింది. ఉదయం మాత్రం రద్దు చేసింది. ఈ సంస్థ రోజుకు రెండు విమానాలను ఢాకాకు నడుపుతుంటుంది. విస్తారా ప్రతి రోజు ముంబయి నుంచి ఢాకాకు రెండు, దిల్లీ నుంచి ఢాకాకు వారానికి మూడు సర్వీసులను నిర్వహిస్తోంది. ఇండిగో దిల్లీ, ముంబయి, చెన్నై నుంచి ఢాకాకు రోజుకొక విమానాన్ని నడుపుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో విస్తారా, ఇండిగో సైతం మంగళవారం తమ రోజువారీ విమానాలను రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో ముందే టికెట్ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఆయా సంస్థలు తగిన ఆఫర్లను ప్రకటించాయి.

ఇటు బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. వారిలో తొమ్మిది వేల మంది విద్యార్థులేనని వెల్లడించారు. పెద్దమొత్తంలో విద్యార్థులు జులైలోనే భారత్‌కు తిరిగి వచ్చేశారని చెప్పారు. దౌత్యవేత్తల ద్వారా అక్కడున్న భారతీయులతో మాట్లాడుతున్నామన్నారు. మైనారిటీల పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపారు. నిన్న సాయంత్రం వెళ్లిన ఓ ప్రత్యేక విమానం ద్వారా ఢాకా నుంచి 205 మందిని ఎయిరిండియా భారత్‌కు తీసుకొచ్చింది. ఇవాళ తెల్లవారుజామున ఈ విమానం భారత్‌లో దిగింది. ఢాకా విమానాశ్రయంలో విమాన సర్వీసులు నడపడానికి అనేక పరిమితులున్నప్పటికీ.. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

బంగ్లాదేశ్ భారీ సరిహద్దు ఉన్నందున ఆ దేశంలోని పరిస్థితులను భారత్ నిశితంగా గమణిస్తోంది. బంగ్లా పరిస్థితులపై నిన్న భారత్‌లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని ప్రధాన పార్టీలకు బంగ్లాలోని ప్రస్తుత పరిస్థితిని.. భారత్ వైఖరిని వివరించారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎన్.జైశంకర్. ఇటు భారత్ మాత్రమే కాదు.. పశ్చిమదేశాలు కూడా బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుంటున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ అధికారిక నివాసం వైట్ హౌజ్‌ ఈ అంశంపై ప్రకటన విడుదల చేసింది.

Tags:    

Similar News