అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న కమలా హారిస్... విరాళాల్లో వెనుకబడిన డోనల్డ్ ట్రంప్

కమలా హారిస్ తరపున విరాళాల సేకరణకు ఆమె బృందం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

Update: 2024-09-07 08:33 GMT

విరాళాల్లో ట్రంప్ ను మించిన కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విరాళాల సేకరణలో ముందంజలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ కంటే ఆమెకు వస్తున్న విరాళాల మొత్తం అత్యధికంగా ఉంది. ఒక్క ఆగస్టులోనే కమలా హారిస్‌కు చెందిన డెమోక్రటిక్ పార్టీకి 361 మిలియన్ డాలర్లు అందాయి. ట్రంప్ పార్టీకి కేవలం 130 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. రిపబ్లికన్ పార్టీ కంటే మూడు రెట్లు అదనంగా హారిస్ కు అందాయి.

విరాళాల సేకరణలో హారిస్ ముందంజ

కమలా హారిస్ తరపున విరాళాల సేకరణకు ఆమె బృందం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకు 615 మిలియన్ డాలర్లు ఆమెకు వచ్చాయి. ఖర్చులు పోనూ ఆమె వద్ద ఇంకా 404 మిలియన్ డాలర్లున్నాయి ట్రంప్ కంటే ఆమె వద్దే 109 మిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టులో హారిస్ కు వచ్చిన విరాళాల్లో మూడొంతుల మంది 2020 అధ్యక్ష ఎన్నికల్లో విరాళం ఇవ్వలేదు. ప్రతి 10 మంది దాతల్లో ఆరుగురు మహిళలు, ప్రతి ఐదుగురిలో ఒకరు రిజిస్టర్డ్ రిపబ్లికన్ లేదా ఇండిపెండెంట్ హారిస్ కు విరాళం ఇచ్చారని ఆమె బృందం తెలిపింది. జో బైడెన్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న తర్వాత 24 గంటల్లో 81 మిలియన్ డాలర్లను ఆమె బృందం సేకరించింది. అధ్యక్షరేసులో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ బరిలోకి దిగడంతో పలువురు ఆ పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు మొగ్గు చూపారు.

ట్రంప్ నకు బిలియనీర్ల మద్దతు

ట్రంప్ కోసం బిలియనీర్లు విరాళాలు సమకూరుస్తున్నారని కమలా హారిస్ టీమ్ ఆరోపణలు చేస్తోంది. మిల్ మెలన్ 125 మిలియన్ డాలర్లు, అడెల్సన్ 100 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చేందుకు హామీ ఇచ్చారని డెమోక్రటిక్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఆరు వారాల్లోనే ఈ ఇద్దరు మిలియనీర్లు ట్రంప్ కోసం 150 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని ఆ పార్టీ చెబుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది జూలై చివరి నుంచి ప్రకటనలు, ప్రత్యక్ష మెయిల్ తదితర కార్యకలాపాల కోసం ట్రంప్ క్యాంప్ 100 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.

జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి తప్పుకున్న తర్వాత డెమోక్రటిక్ పార్టీకి విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య పెరిగింది. జూలై చివరి 11 రోజుల్లో 1.5 మిలియన్ కొత్త దాతలు ఆ పార్టీకి విరాళం ఇచ్చారు.

Tags:    

Similar News