సీఎం చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడం, కేంద్రంపై అవిశ్వాసం పెట్టడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో కేంద్రం ఏపీ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించింది. అంతేకాకుండా ఏపీ పార్టీ వ్యవహారాల బాధ్యతల్ని అమిత్ షా..,రామ్ మాధవ్ కు అప్పగించారు. మరోవైపు అమిత్ షాతో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లు నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్రఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడంతో ఏపీ టీడీపీ నష్టనివారణచర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఎన్డీఏ నుంచి బయటకు రావడం, ఆ తరువాత సొంతంగానే బీజేపీ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇతర పార్టీల అధినేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
ఇదే సమయంలో తన రాజకీయ చతురతకు పదును పెట్టిన అమిత్ షా ఏపీ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా చంద్రబాబు అవిశ్వాస తీర్మానం, వైసీపీ తో పొత్తు తదితర అంశాలకు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్డీఏతో చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసమా..? ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుందనా..? లేదంటే టీడీపీ ఆరోపణలు చేస్తున్నట్లు జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల్ని మాఫీ చేసుకునేందుకా అనే విషయం పక్కనపెడితే.
ఎన్డీఏ నుంచి పక్కకు తప్పుకున్నామని చంద్రబాబు ప్రకటన చేయడంతో..బీజేపీ - వైసీపీలు కలిస్తే ఎలాంటి లాభనష్టాలు చోటుచేసుకుంటాయనే విషయంపై స్పష్టత వచ్చేలా జగన్ తన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిపినట్లు టాక్ . అనంతరం ఓ నివేదికను తయారు చేసినట్లు ... ఆ నివేదికతో ఢిల్లీ లో అమిత్ షా - ఏపీ బీజేపీ నేతలతో జరిపిన సమావేశానికి ప్రశాంత్ కిషోర్ హాజరైనట్లు రాజకీయవిశ్లేషకుల అంచనా . దీంతో టిడిపి ఎన్డీఎ నుంచి వైదొలిగిన వెంటనే వైసిపి చేరేందుకు సిద్ధపడిందనే ఊహాగానాలకు బలం చేకూరిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ సమావేశానికి హాజరయ్యారనే వాదన వినిపిస్తోంది. ఆసక్తిని కలిగిస్తోంది. బీజేపీ - వైసీపీ ల మధ్య ఎన్నికలకు ముందే పొత్తు ఉంటుందా, తర్వాత ఇరు పార్టీలు ఏకమవుతాయా అనే విషయంపై చర్చ సాగుతోంది.