ప్రత్యేకహోదా లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఒకవైపు సీఎం చంద్రబాబు హస్తిన బాట పట్టగా మరోవైపు వైసీపీ అధినేత తనదైన వ్యూహంతో ఢిల్లీ యుద్ధానికి సన్నద్ధమయ్యారు. తమ పోరాటంతో ఇటు రాష్ట్రంలోనే, అటు కేంద్రంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు.
ముందు నుంచీ చెప్తున్నట్టుగానే పార్లమెంట్ చివరి రోజు ఎంపీలతో రాజీనామా చేయిస్తున్న జగన్.. ఏపీ భవన్ వేదికగా ఎంపీలను ఆమరణ దీక్షకు దించనున్నారు. ఆమరణ దీక్ష చేసే ఎంపీలకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లి ఒకరోజు దీక్షలో పాల్గొంటారు. ఢిల్లీలో దీక్ష చేస్తుండటంతో ఇతర పార్టీలు, ప్రజల మద్దతు కూడా తనకుంటుందని వైసీపీ భావిస్తోంది. ఎంపీలు దీక్ష చేస్తున్న సమయంలో రాష‌్ట్రంలో యువత రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని జగన్ కోరుతున్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయకపోతే ఢిల్లీ వేదికగా ఆ పార్టీని ఎండగట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
ఎంపీలతోపాటు తమ ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయిస్తే బాగుంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎంపీలతోపాటు 47 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో వైసీపీకి మైలేజ్ బాగుంటుందని భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటంతో పార్టీలో కొందరు అభ్యంతరం చెబుతున్నారు. 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్‌లా మారిన ప్రత్యేకహోదా పోరాటాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ పోరాటాలతో పార్టీని ప్రజల్లోకి మరింత సమర్ధవంతంగా తీసుకెళ్లడానికి హస్తినను వేదికగా మలచుకుంటోంది.