విభజన ప్రక్రియ ఏ ముహూర్తంలో మొదలైందో కానీ.. నాటి నుంచి ఇప్పుడు విభజన జరిగి నాలుగేళ్లు కావొస్తున్నా.. కేంద్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి తిప్పలు తప్పడం లేదు. నాడు యూపీయే ప్రభుత్వానికి ఈ సమస్యలు ఎదురైతే.. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా.. ఏపీ, తెలంగాణ తీరుతో ఇబ్బందుల్లో పడుతోంది. విభజన హామీలు.. బడ్జెట్ లో కేటాయింపులపై.. కేంద్రం తెలుగు రాష్ట్రాల మీద వివక్ష చూపించడమే.. ఇందుకు కారణమవుతోంది.
దీంతో.. ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇద్దరూ కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి కనిపిస్తోంది. అవసరమైతే ఎన్డీయే నుంచి తెగదెంపులు చేసుకుందాం అన్న ఆలోచనలో టీడీపీ నేతలు ఉంటే.. కేసీఆర్ కూడా బహుముఖ వ్యూహంతో కేంద్రంపై నిధుల కోసం ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. మధ్యలో.. తనకు మాత్రమే సాధ్యమైన వాగ్బాణాలు కూడా సంధిస్తూ కొత్త చర్చకు తెర తీస్తున్నారు.
ఊహించని ఈ పరిణామానికి కాస్త ఆలోచనలో పడిన కేంద్రం.. ముందుగా ఏపీ విషయంలో స్పందించింది. ఓ ప్రతినిధి బృందాన్ని పంపిస్తే చర్చిస్తామని కబురు పెట్టింది. కానీ.. తెలంగాణ విషయంలోనే కేంద్రం అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న తరుణంలో.. ముందు ముందు ఈ పరిణాలు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారి తీస్తాయో అన్నది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.