Weather Report: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు
Weather Report : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని ఐఎండి పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తాలో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.
రాయలసీమ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఇక తెలంగాణలో పూర్తిగా వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 5-6 రోజులు ఇలాంటి వాతావరణం ఉంటుందని తాజా బులిటెన్ లో పేర్కొంది. తెలంగాణకు ఎలాంటి వర్షసూచన లేదని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం స్పష్టం చేసింది. జనవరి 17వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉదయం పొగ మంచు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని ఆ హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది.