Pawan Kalyan: బెజవాడ బుక్ ఫెయిర్‌లో రూ.10 లక్షలతో పుస్తకాలు కొనుగోలు చేసిన పవన్.. అందుకోసమేనా..?
Pawan Kalyan Books: విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్‌లో రూ.10 లక్షల విలువైన పుస్తకాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు.
Pawan Kalyan Books: విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్‌లో రూ.10 లక్షల విలువైన పుస్తకాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. అయితే పవన్ ఇక్కడకు వస్తున్నారన్న సమాచారాన్ని మీడియాకు తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. పుస్తక మహోత్సవం నిర్వాహకులతో మాట్లాడిన పవన్.. తన సొంత డబ్బుతో పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇంత భారీ మొత్తంలో పుస్తకాలు కొనుగోలు చేసి రికార్డు నెలకొల్పారు. డిప్యూటీ సీఎం పవన్ పుస్తక ప్రియుడు అన్న సంగతి తెలిసిందే.. అయితే ఇంత పెద్ద మొత్తంలో పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఓ కారణం ఉంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యువతకు పుస్తక పఠనం అలవావటు చేసేలా అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఆ గ్రంథాలయంలో ఈ పుస్తకాలు ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీని విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బుక్ ఫెయిర్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా పుస్తక పఠనం ద్వారా కలిగే ప్రయోజాలను, వ్యక్తిగతంగా తనకు కలిగిన మేలును వివరించారు. పుస్తక పఠనం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎవరికైనా పెద్ద మొత్తంలో సొమ్ములు ఇవ్వడానికి క్షణం ఆలోచించను కానీ.. ఒక పుస్తకం ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తానని చెప్పారు.
పుస్తకాలు కొనుగోలు చేయడానికి బుక్ ఫెయిర్‌కు వెళ్లిన పవన్.. అంతా కలియతిరిగారు. పలు స్టాల్స్ సందర్శించారు. పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తన సొంత డబ్బుతో సుమారు రూ.10 లక్షల విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు చేసిన పుస్తకాల్లో అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాత్మిక సంబంధిత రచనలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే అంతకు ముందు అంటే శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆధునిక వసతులతో పిఠాపురంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్న పుస్తకాలన్నీ ఆ లైబ్రరీ కోసమేనని తెలుస్తోంది.