ఉద్యమం నుంచి పొలిటికల్ పార్టీగా పురుడుపోసుకున్న తెలంగాణ జనసమితి.. రాజకీయంగా కూడా సత్తా చాటేందుకు ఉవ్వీళ్లూరుతోంది. వచ్చే పంచాయితీ ఎన్నికలనే వేదికగా మలుచుకోబోతోంది. అందుకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. సాధారణ ఎన్నికల నాటికి రాజకీయంగా బలమైన పాత్ర పోషించేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో ఏర్పాటైన తెలంగాణ జనసమితి.. రానున్న గ్రామపంచాయితీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది. బరిలో నిలిపే అభ్యర్థులను ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంపిక చేయనుంది. దీనికి స్క్రూట్నీని కూడా పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణస్థాయిలో ఉన్న యువత, నిరుద్యోగులను ఆకట్టుకోవాలని ప్రణాళికలను రచిస్తోంది. ఇప్పటికే తమ పార్టీ వెబ్‌సైట్‌లో 12 వందల మంది నమోదు చేసుకున్నారని.. కోదండరామ్ తెలిపారు.
ఇక అభ్యర్థుల విషయంలో సామాజిక న్యాయం తప్పకుండా పాటించాలని.. తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు అంజి యాదవ్ తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే అభ్యర్థిని ఎన్నుకోవాలని.. సూచించారు. పంచాయితి ఎన్నికల్లో పోటి చేయడం ద్వారా.. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు.. తెలంగాణ జనసమితి సాంకేతికను ఉపయోగించుకుంటోంది.