Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రేసులో ఐదుగురు
Telangana BJP State President: బీజేపీ తెలంగాణ (Telangana) అధ్యక్ష పదవికి ఐదుగురు నాయకుల మధ్య పోటీ ఉంది.
Telangana BJP State President: బీజేపీ తెలంగాణ (Telangana) అధ్యక్ష పదవికి ఐదుగురు నాయకుల మధ్య పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డి.అరవింద్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రామచందర్ రావు మధ్య పోటీ నెలకొంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ పదవిని దక్కించుకునేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
జనవరిలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
కమలం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. సభ్యత్వ నమోదు పూర్తైంది. గ్రామ, మండల కమిటీల ఎన్నిక జరుగుతోంది. డిసెంబర్ 31 నాటికి జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని టార్గెట్ గా నిర్ణయించుకున్నారు. 2025 జనవరిలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలంటే రాష్ట్రంలో కనీసం 50 శాతం జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి.ఈ దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
అధ్యక్ష పదవి రేసులో నిజామాబాద్ ఎంపీ అరవింద్
బీజేపీ అధ్యక్ష పదవి రేసులో నిజామాబాద్ ఎంపీ అరవింద్ (arvind )పేరు కూడా తెరమీదికి వచ్చింది. బీసీ సామాజికవర్గం కోటాలో అరవింద్ తనకు అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. బీజేపీ(bjp)లో మొదటి నుంచి ఉన్న నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎస్. రామచందర్ రావు ( ramachander rao) పేరును బీజేపీ అధ్యక్ష పదవికి సిఫారసు చేసినట్టుగా ప్రచారంలో ఉంది. ఆర్ఎస్ఎస్ (RSS) కూడా ఆయనకు సపోర్ట్ ఉందని చెబుతున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మద్దతు ఈటల రాజేందర్ (eatala rajender) కు ఉందని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు (raghunandan rao), మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి (chintala Ramachandra reddy, తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే ఈటల రాజేందర్, అరవింద్ పేర్లను కమలం పార్టీ నాయకత్వం పరిశీలించే అవకాశం ఉంది.
బ్రహ్మణ సామాజికవర్గానికి కేటాయించాలని భావిస్తే ఎస్. రామచందర్ రావును ఎంపిక చేయవచ్చు. రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే చింతల రామచంద్రారెడ్డికి అవకాశం దక్కనుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన కిషన్ రెడ్డే ఉన్నారు.దీంతో రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఉండకపోవచ్చని పార్టీలో ప్రచారం సాగుతోంది.