Manchu Mohan babu hospitalised: మోహన్ బాబు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు బీపీ ఎక్కువ అవడంతో పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అంతకంటే ముందుగా జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చిన్న కొడుకు మంచు మనోజ్‌తో ఘర్షణ జరిగింది.
మోహన్ బాబు ఇంట్లో తన కూతురు ఉందని, ఆమెను తీసుకెళ్లడానికే తాను వచ్చానని చెబుతూ మనోజ్, ఆయన భార్య భూమా మౌనికా రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే, వారిని లోపలికి అనుమతించలేదు. ఇదే కారణమై మనోజ్ బలవంతంగా గేటు తోసుకుని ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అది తెలుసుకుని మోహన్ బాబు ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే మనోజ్ వెంటే మీడియా కూడా లోపలికి వెళ్లి పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
మీడియా తనని ప్రశ్నించడంతోనే ఆగ్రహం తెచ్చుకున్న మోహన్ బాబు తన ఎదుట ఉన్న మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. మీడియా కెమెరాలు, పోలీసుల ఎదురుగానే ఈ దాడి జరిగింది. ఈ ఘటన తరువాతే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.