Mohan babu attack on Media: మీడియాపై మోహన్ బాబు దాడి... మైక్ లాక్కొని ఆవేశంగా..
Mohan babu attack on Media: మోహన్ బాబు.. మోహన్ బాబు.. మోహన్ బాబు... ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే పదం వినబడుతోంది. మంచు మోహన్ బాబు కుటుంబంలో మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య వివాదాలు, మనస్పర్థలు బయటపడిన తరువాత ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇదే ఘటనలో మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియాపై మోహన్ బాబు అదే మైక్ లాక్కొని దాడి చేశారు. మీడియా మైక్‌నే లాక్కున్న మోహన్ బాబు... ఆవేశంగా అదే మైక్‌తో దాడి చేశారు. ప్రస్తుతం టీవీల్లో, సోషల్ మీడియాలో ఆ దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
అంతకంటే ముందు అసలేం జరిగిందంటే..
మంచు మనోజ్, మౌనిక దంపతులు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. తన కూతురు ఇంట్లోనే ఉందని, ఆమెను తీసుకెళ్తానని చెబుతూ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ మోహన్ బాబు ఇంటి వద్ద సెక్యురిటీలో ఉన్న బౌన్సర్లు, సిబ్బంది వారిని గేటులోపలికి అనుమతించలేదని తెలుస్తోంది. దీంతో అక్కడ మోహన్ బాబు ఇంటి బయటున్న సెక్యురిటీ, బౌన్సర్లకు మంచు మనోజ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలోనే కాసేపు బయటే వేచిచూసిన మంచు మనోజ్ చివరకు గేటును తోసుకుని లోపలికి వెళ్లారు.
మంచు మనోజ్ గేటు తోసుకుని లోపలికి వెళ్లడంతో మీడియా కూడా ఆయన్నే అనుసరించినట్లు తెలుస్తోంది. ఇంట్లోంచి బయటికొచ్చిన మోహన్ బాబుతో అక్కడే ఉన్న మీడియా సిబ్బంది మాట్లాడించే ప్రయత్నం చేశారు. అసలు మోహన్ బాబుకు, మనోజ్‌కు మధ్య వివాదం ఏంటి? ఎందుకు లోపలికి అనుమతించడం లేదని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మీడియాపై కోపం తెచ్చుకున్న మోహన్ బాబు అదే ఆవేశంతో వారి చేతిలో ఉన్న మైక్ లాక్కుని ఇలా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం మోహన్ బాబు దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.