1) జర్నలిస్టులను కొట్టాలని అనుకోలేదు: మోహన్ బాబు
జర్నలిస్టులను తాను కొట్టాలని అనుకోలేదని మోహన్ బాబు చెప్పారు. ఆసుపత్రి నుంచి గురువారం మధ్యాహ్నం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాకు ఓ ఆడియో విడుదల చేశారు. విజయవాడలో తాను ఒకప్పుడు ఉద్యోగినేనని ఆయన చెప్పారు. తొలుత తాను నమస్కారం పెట్టా.. ఆ సమయంలోనే అతను మైక్ పెట్టాడు...తన కన్నుకు మైక్ తగలబోయింది.. కానీ, తప్పించుకున్నానని ఆయన వివరించారు. వచ్చినవారు మీడియా వారా.. వేరే వారు ఎవరైనా వచ్చారా అనే అనుమానం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నానని చెప్పారు.తను కొట్టడం తప్పే.. కానీ సందర్భాన్ని అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు.
2) మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్: భట్టి
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు.గురువారం ఆయన న్యూదిల్లీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన దిల్లీకి వచ్చారు. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు.హైడ్రాకు పేద,ధనిక అనే తేడా లేదన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ నాయకత్వంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకుంటారు.
3) జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
జమిలి ఎన్నికలకు సంబంధించి ముందడుగు పడింది. వన్ ఎలక్షన్ వన్ నేషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి.
4) ఒకే రోజు 1500 మందికి శిక్ష తగ్గించిన జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ఒక్క రోజే 1500 మంది ఖైదీలకు శిక్ష తగ్గించడంతో పాటు, 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అధ్యక్ష పదవి కాలం ముగింపు దశకు వచ్చింది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికొందరికి శిక్షలు తగ్గించడం, క్షమాభిక్ష పిటిషన్లను పరిశీలిస్తానని బైడెన్ ప్రకటించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఒకే రోజు 330 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. 21 మందికి క్షమాభిక్ష పెట్టారు. బైడెన్ ఇప్పటివరకు 122 మందికి శిక్ష తగ్గించారు. 21 మందికి క్షమాభిక్ష పెట్టారు. ఒకే రోజు 1500 మందికి శిక్ష తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారని చబుతున్నారు.
5) Revanth Reddy: రైతు ఈర్యానాయక్ కు బేడీలు వేయడంపై విచారణకు ఆదేశం
లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు ఈర్యానాయక్ చేతులకు బేడీలు వేయడంపై తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఈర్యానాయక్ సంగారెడ్డి జైలులో ఉన్న సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఆయనను జైలు అధికారులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో రైతు చేతికి బేడీలు వేశారు. ఈ విషయం సీఎం దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
ఈర్యానాయక్ కు తొలుత సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈర్యానాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి సంగారెడ్డి వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రైతు నాయక్ కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
6) స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి సురేష్..గోవాలో సాంప్రదాయ పద్దతిలో జరిగిన పెళ్లి
హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)హ బంధంలోకి అడుగు పెట్టింది. తన స్నేహితుడు ఆంటోని (Antony Thattil)ని వివాహం చేసుకున్నారు.గోవా (goa)
లోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి వేడుక సాంప్రదాయ పద్దతిలో జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితులు వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు.ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.
15ఏళ్ల స్నేహ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంది కీర్తి. స్కూల్ డేస్ నుంచి కీర్తి సురేష్-ఆంటోని కలిసి చదువుకున్నారు. అయితే అది కాస్త కాలేజీ డేస్‌కు వచ్చే సరికి ప్రేమగా మారింది. పెళ్లికి కొన్ని రోజుల ముందే ఈ విషయాన్ని ఆమె బయటపెట్టారు.దీపావళి సందర్భంగా ఆంటోనితో దిగిన ఫొటోనే షేర్ చేసింది. తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపింది.