Pushpa 2 Movie celebrates Rs 1000 crores collections club party: పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్ల వసూళ్లు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ చేస్తున్న హంగామాకి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. దీంతో వసూళ్లు హోరెత్తుతున్నాయి. హిందీలో తొలి అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా పుష్ప 2 మూవీ నిలిచింది. ఆరు రోజుల్లో ఈ సినిమా అక్కడ రూ.375 కోట్లు వసూలు చేసింది. అక్కడ ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా పుష్ఫ 2 నిలిచింది.
ఈ రోజుతో పుష్ప 2 సినిమా బాలీవుడ్‌లో రూ.400 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేయడం గ్యారంటీ అంటున్నారు సినీ విశ్లేషకులు. హిందీలో దాదాపు రూ.600 కోట్ల నెట్ వసూళ్ల వరకు రాబట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. అత్యంత వేగంగా రూ.1002 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప2 నిలిచింది.
అంతేకాదు ఫస్ట్ డే రూ.294 కోట్లతో అత్యధిక కలెక్షన్ రాబట్టిన భారతీయ సినిమాగా కూడా పుష్ప2 రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు తెలుగులో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలు.. కన్నడ నుంచి కేజీఎఫ్ 2, హిందీలో పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లో ఉన్నాయి.
ఇక పుష్ప 2 సక్సెస్ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లోని ఒక పబ్‌లో దర్శకుడు సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పార్టీకి హాజరయ్యారు. ఇక పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథను మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. సినిమా చివర్లో పుష్ప 3 కూడా తీస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇంకా ఎన్ని కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.