ప్ర‌త్యేక‌హోదా..ఏపీ ప్ర‌భుత్వంపై బాంబు పేల్చిన జైట్లీ

Update: 2018-03-18 09:02 GMT

ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌న రూటును మార్చుకుంద‌ని  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బాంబు పేల్చారు. 14వ ఆర్ధిక సంఘం సూచ‌న‌ల ప్ర‌కారం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని జైట్లీ స్ప‌ష్టం చేశారు. కానీ ప్యాకేజీ కింద నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. 
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ పార్ల‌మెంట్ లో వైసీపీ - టీడీపీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో స్పందించిన కేంద్రం ఆర్ధిక మంత్రి జైట్లీ ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇచ్చేది లేదని ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వంపైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీడీపీ మిత్రప‌క్షానికి గుడ్ బై చెప్పింది. వైసీపీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టింది. ఈనేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక‌ప్యాకేజీ అంశంపై జైట్లీ స్పందించారు. 
తాము 2016లో ఏపీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపి ..ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేం. ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని.,అందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అంగీక‌రించిందని జైట్లీ చెప్పారు. అంతేకాదు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల ఫండ్‌ను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం కేంద్రం ఇస్తుందని చెప్పారు. జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు 40 శాతంగా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఏపీకి అయిదేళ్ల పాటు ఇచ్చేందుకు 2016లో అంగీకరించామన్నారు. అలాగే ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం ఇస్తుందన్నారు.
కానీ  జనవరిలో ఏపీ తన రూటు మార్చి త‌మకు  నిధులు కావాలని అడిగింద‌ని బాంబు పేల్చారు.  అప్పుడు ఏపీకి రుణ సామర్థ్యం తగ్గుతుందని పునరుద్ఘాటించారు. ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చేందుకు సూచన చేశామన్నారు. ఇందులో కేంద్రం 90 శాతం చెల్లిస్తుందన్నారు.  ఇప్పటి వరకు రాలేదు, వేచి చూస్తున్నాం ఫిబ్రవరి 7న ఏపీ అధికారులతో సమావేశం జరిగితే ప్రభుత్వాన్ని అడిగి వస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్కరు రాలేదని జైట్లీ అన్నారు.
ఈ సంద‌ర్భంగా త‌మ‌ది ఒక‌టే మాట . అప్పుడు ఏం హామీ ఇచ్చామో..ఇప్పుడు అదే హామీ ఇస్తున్నాం. 14వ ఆర్ధిక సంఘం చెప్పినట్లుగా ఏపీకి ప్ర‌త్యేక‌ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.  మీకు హామీలు కావాలా..?  మా గొడ‌వ‌లు కావాలా..? ఏం కావాలో ఏపీ ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యించుకోవాలి అని సూచించారు.  

Similar News