టిడిపి రాజ్యసభ అభ్యర్థులుగా చంద్రబాబు ఎంపిక చేసిన ఇద్దరి పేర్లపై తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి తరుపున రెండు పేర్లు వెలువడిన వెంటనే మొదటి అభ్యర్థి అయిన సిఎం రమేష్ పేరుపై ఆశ్చర్యం కలగకపోయినా...వ్యతిరేకత మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండో అభ్యర్థిగా వర్ల రామయ్య దాదాపుగా ఖరారైపోయిన దశలో చివరి క్షణంలో అనూహ్యంగా కనకమేడల రవీంద్ర కుమార్ కు అవకాశం లభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే చంద్రబాబు నిర్ణయం బాధ కలిగించినా ఆయన నిర్ణయం తనకు శిరోధార్యమని వర్ల రామయ్య ప్రకటించడం టిడిపికి ఊరటనిచ్చింది. వర్ల రామయ్య ఏమాత్రం వ్యతిరుకంగా మాట్లాడివున్నా సున్నితమైన ఈ సమయంలో చంద్రబాబుకు చాలా ఇబ్బందికరంగా పరిణమించి ఉండేది. అయితే కారణాలు ఏమైనప్పటికి ముందునుంచి ప్రచారం జరిగిన విధంగా ఒకరు ఒసీకి, మరొకరికి ఎస్సీకి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరగగా,చివరకు ఇద్దరకు ఓసీలకే సీట్లు దక్కడం ముందు ముందు టిడిపికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. టిడిపి తరఫున రాజ్యసభ బరిలోకి దిగుతున్నఇద్దరు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పేర్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు.
చంద్రబాబునాయుడుగారి నిర్ణయం మేరకు రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్ మరియు కనకమేడల రవీంద్రకుమార్ లను ప్రకటించడం జరిగింది...అనే ఏకవాక్యంతో ఈ ప్రతికా ప్రకటన విడుదల కావడం గమనార్హం. టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మీద ఆ పార్టీ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమయింది. అంతేకాదు పేర్లు వెలువడిన వెంటనే ఈసారి ఆశ్చర్యకరంగా వీరి కులాల గురించి తెలుసుకునేందుకు ఎక్కవమంది ప్రయత్నించారట. ఆ తరువాత వీరిద్దరూ ఓసీలేనని...సిఎం రమేష్ వెలమ కులానికి చెందిన వ్యక్తి కాగా రెండో వ్యక్తి న్యాయవాది అయిన కనకమేడల రవీంద్రకుమార్ కమ్మ అని తెలిసి ఆశ్యర్యపోయారట. ముందునుంచి ప్రచారం జరుగుతున్న విధంగా ఎస్సీ వర్గానికో,బిసి వర్గానికో కనీసం ఒక సీటు అయినా ఇవ్వకపోవడం, చంద్రబాబుకు బినామీగా బైట బాగా ప్రచారంలో ఉన్న సిఎం రమేష్ నే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబు రిస్క్ తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సిఎం రమేష్ ను ఇలాంటి తరుణంలో సైతం ఎంపిక చేయడం ద్వారా అతడు చంద్రబాబుకు బాగా కావాల్సినవాడంటూ జరిగే ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లు అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఒక పేరైనా వివాదానికో, అనుమానానికో తావులేకుండా ఉంటే బాగుండేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నట్లు తెలిసింది.