సీఎం చంద్రబాబు రాజకీయాల్లో అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నేతలతో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించిన చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు భవిష్యత్తు కార్యచరణ గురించి దిశానిర్ధేశం చేశారు.
నిన్న వెలువడిన ఉత్తరపద్రేశ్ ఉపఎన్నికల ఫలితాలపై మాట్లాడిన చంద్రబాబు ప్రజల మనోభావాల్ని గౌరవించకపోవడం వల్లే బీజేపీ ఓటమిపాలైందని చెప్పుకొచ్చారు. ఇక ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ ఇవ్వడం కుదరదని బీజేపీ తెగేసి చెప్పడంతో ..మిత్రపక్షంగా ఉన్న కేంద్రంతో మొతక వైఖరిని ప్రదర్శిస్తూ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల్ని సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ తో తెగదెంపులు చేసుకోవడం వల్ల యూపీలో బీజేపీ ఓడిపోయింది కాబట్టే ఏపీలో బీజేపీ నుంచి టీడీపీ విడిపోతున్నారని అంటారని , కాబట్టి అలా కాకుండా ఓ వ్యూహంతో అడుగులు వేయాలని స్పష్టం చేశారు.
జైట్లీ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ నేతలు తనతో ఎన్డీఏ నుంచి బయటకు రావాలని సూచించినట్లు చెప్పారు. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయాలతో తాము బీజేపీ తో కొనసాగించాలా..? లేదా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇక కేంద్రంపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న చంద్రబాబు ..టీడీపీ మంత్రులు కేంద్రకేబినేట్ నుంచి తొలగిపోవాలని నిర్ణయం తీసుకున్న మరునాడే పీఎం మోడీ తనతో మాట్లాడినట్లు గుర్తు చేశారు. నాడు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామన్న మోడీ ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆవేదన బీజేపీతో పొత్తు వల్ల అటు తెలంగాణలోను.... ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను కూడా తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతుందని, తెలంగాణలో రాజకీయంగా ఉపయోగపడుతుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. అయితే, తెలంగాణలో ఏకపక్షంగా పొత్తు ఉండదని బీజేపీ ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్‌కు సహకారం చూస్తే ఇలా ఉందని వాపోయారు.