జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ ఏపీ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. ఈ రోజు గుంటూరులో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా తనకు సెక్యూరిటీ కల్పించాలని కోరారు. అంతేకాదు సభ తరువాత కూడా తనకు భద్రత కొనసాగించాలని అన్నారు. సభ జరుగుతుందనే ఉద్దేశంతో తాము సెక్యూరిటీని కోరడం లేదని ప్రజా సమస్య దృష్ట్యా భద్రత కొనసాగించాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో తెలుగురాష్ట్రాల్లో కొన్ని సభలు నిర్వహించినప్పుడు భద్రత సమస్య తలెత్తిందని అన్నారు. తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని .. గతంలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ లేఖ రాశారు.
గతంలో భీమవరంపట్నంలో తన ఫ్లెక్సీని చించేసినందుకు ఘర్షణ తలెత్తిందని దీంతో అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. అలాగే కాకినాడ, విజయవాడలో ఉద్దానం, సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ప్రతీసారి దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బంది పడ్డారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
పార్టీ ఆవిర్భావసభ , ఆ తరువాత భద్రతను కొనసాగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపర్యటనల సందర్భంగా తనపై దాడి జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. సానుభూతితో పరిశీలించాలని, తన విన్నపాన్ని మన్నించాలని కోరారు.
కాగా జనసేన పార్టీ కమిటీలపై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన పవన్ ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. వచ్చిన వార్తలు అవాస్తవమని ఆ పార్టీ ఖండించింది. తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొంది. ఇటువంటి ప్రచారాలన్నీ ఎవరూ నమ్మొద్దని, ఏళ్ల తరబడి కష్టపడుతున్న నిజమైన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని పేర్కొంది. పార్టీ శ్రేణులు ఎటువంటి గందరగోళానికి గురికావొద్దని సూచించింది.