జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కేంద్రాన్ని ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ మహాసభలో మాట్లాడిన పవన్ ..నాడు రాష్ట్ర విభజన సందర్భంగా ఎమికి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామంటూ అధికారంలో వచ్చిన బీజేపీ ...ఆ హామీల్ని అమలు పరిచిందా అని ప్రశ్నించారు. మీరిచ్చిన మాటల్ని నిలబెట్టుకోనప్పుడు మీ చట్టాల్ని మేమెందుకు పాటించాలని మండిపడ్డారు.
పార్లమెంట్ లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆందోళన చేస్తుంటే ...ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఆంధ్రుల గుండెల్ని పిండేస్తోందని అన్నారు. రాజధాని లేకుండా తెలంగాణ నుంచి ఆంధ్రులని పంపించేశారని, విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని వ్యాఖ్యానించిందని, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఇవ్వడం లేదని అన్నారు.
అంతేకాదు నాడు రాష్ట్ర విభజన సందర్భంగా తాను చంద్రబాబు ఎందుకు మద్దతుపలికారో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి అనుభవజ్ఞులైన నాయకులు కావాలి. అలాంటి వారే ఏపీని అభివృద్ధి చేస్తారని తాను చంద్రబాబుకు మద్దతు పలికినట్లు సూచించారు. కానీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది.
అధికారంలోకి వచ్చిన నాలుగుసంవత్సరాలలలో మూడు మాటల్లో ఆరు అసత్యాలు వినపడుతున్నాయని ఆరోపించారు. లక్షల కోట్ల ఎంవోయిలు జరిపినట్లు చంద్రబాబు చెప్పారు. మరి ఎంవోయిలతో ఒక్కరూపాయి అయినా రాష్ట్రానికి వచ్చిందా అని ప్రశ్నించారు.
నాడు అభివృద్ది అంతా హైదరాబాద్ లో చేశారు. మిగిలిన జిల్లాల సంగతి పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే చేస్తుంది. అభివృద్ది అంతా అమవరావతిలో ఉంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలు ఏం కావాలి అని విమర్శనాస్త్రాలు సంధించారు.