జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గుంటూరులో భారీ బహిరంగం సభ నిర్వహించారు. ఆ సభలో మునుపెన్నడూలేని విధంగా అధికారంలో టీడీపీ పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చామో చెప్పిన పవన్ 2019 ఎన్నికల్లో మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
అధికారంలో వచ్చిన తరువాత టీడీపీ సృష్టించిన అరచకాలు అన్నీ ఇన్నీ కావంటూ మండిపడ్డారు. ఇసుక మాఫీయా, ఫాతిమా కాలేజీ విద్యార్ధుల భవిష్యత్తు, నారాలోకేష్ అవినీతి, చంద్రబాబు ఓటుకు నోటు కేసు, టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి భాగోతాల్ని ఎండగట్టారు. దీంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. నాలుగేళ్లుగా టీడీపీ తో సన్నిహిత సంబంధాలు నెరిపిన పవన్ ఒక్కసారిగా ఆ పార్టీపై విమర్శలు చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది.
అంతేకాదు విభజన చట్టంలోకి హామీల్ని నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ - ప్రతిపక్షహోదాలో ఉన్న వైసీపీని పవన్ ఒక్కమాటమాట్లాడలేదని చంద్రబాబు పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.
పవన్ కల్యాణ్ సభ అనంతరం పార్టీ నేతలతో భేటీ నిర్వహించిన చంద్రబాబు పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన కేంద్రాన్ని ఒక్కమాట అనని పవన్ ..రాష్ట్రం కోసం కేంద్రంపైన పోరాటం చేస్తున్న తమపై విమర్శలు చేయడాన్ని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
గుంటూరులో పవన్ సభ పెట్టింది మమ్మల్ని ఆడిపోసుకోవడానికే. కేంద్రంపై రాష్ట్రప్రజల్లో ఇంత అసహనం ఉంటే ..పవన్ ఒక్కమాట అనకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని..? చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ శక్తులన్నీ ఏకమై కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాల్ని సాధించుకోవాల్సిన సమయం. కేంద్రంపై పార్లమెంట్ లో , రాష్ట్రంలో టీడీపీ నేతలు పోరాటం చేస్తుంటే పవన్ కల్యాణ్ మమ్మల్ని అనడం ఏంటని చంద్రబాబు అన్నారు.
ఇన్నీ రోజులు సైలెంట్ గా ఉన్న పవన్ ఒక్కసారిగా మాట్లాడుతున్నారు. ఇది ఎవరో ఆడిస్తున్న నాటకమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ చంద్రబాబు ఆరోపించారు.