పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై టీడీపీ నేతల పరిస్థతి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నచందంలా తయారైంది. తమతో స్నేహంగా ఉన్న పవన్ కల్యాణ్ విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు జనసేనాని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ మంత్రి నారాయణ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ఆవిర్బావ సభలో నాలుగేళ్లలో టీడీపీ చేసిన అవినీతిని గుర్తు చేసిన పవన్ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారాలోకేష్ పై విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఆంధ్ర్రప్రదేశ్ లో ఉందని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏపీని కరప్షన్ ఆంధ్రాగా మార్చేశారు. స్కాంల ఆంధ్రప్రదేశ్ కాకూడదని 2014 ఎన్నికల్లో మీకు మద్దతు పలికితే మీరు చేసింది ఏంటని సూటిగా ప్రశ్నించారు.
మీ అబ్బాయి లోకేష్ చేస్తున్న అవినీతి మీ దృష్టికి వచ్చిందా అని నేరుగా చంద్రబాబును పవన్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ రూ.2కే బియ్యం ఇస్తే ఆయన మనవడైన నారా లోకేష్ ఏం చేస్తున్నారు. జగన్ ను ఎదుర్కొవాలంటే అవినీతి చేసుకోవాలంటున్నారని లోకేష్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
అంతేకాదు కాపులకు రిజర్వేషన్లపై స్పందించిన పవన్ ..ఏపీలోకి కాపు కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఇవి రాష్ట్రపతికార్యాలయంలోని కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. కాపులకు, బీసీలకు మత్స్యుకారులకు ,ఎస్టీలకు మధ్య గొడవలు పెట్టారు. రిజర్వేషన్లు కల్పించలేమని ప్రజల్ని మభ్యపెట్టారని అన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ జనసేనాని పై మండిపడ్డారు. పవన్ వైసీపీ - బీజేపీతో చేతులు కలిపారని , అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి కాపులను తాకట్టుపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వల్ల కాపులు 20ఏళ్లు వెనక్కి పోయారని అన్నారు. పవన్ సభ టీడీపీని టార్కెట్ చేసేందుకే పెట్టారని , టీడీపీ ఎమ్మెల్యేలంతా అవినీతిపరులని అనడం సినిమా డైలాగులేనని నారాయణ అన్నారు. యువకుడు, నిజాయితీ గా పనిచేస్తున్న మంత్రి నారాలోకేష్ పై వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి నారాయణ సూచించారు.