కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, నల్గొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటికి కూతవేటు దూరంలోనే శ్రీనివాస్‌ను దుండగులు చంపేశారు. గొడవ జరుగుతోంది ఆపుదాం రమ్మంటూ అర్థరాత్రి శ్రీనివాస్‌ని తీసుకెళ్లిన దుండగులు ఇంటికి సమీపంలోనే రాళ్లతో కొట్టిచంపారు. అత్యంత పాశవికంగా తల, ముఖం చిద్రంచేసి డ్రైనేజీలో పడేశారు. భర్త దారుణహత్యతో ఆయన భార్య నల్గొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి కుప్పకూలిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను అతని సన్నిహితులే చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. శ్రీనివాస్ అనుచరులు, అతని సన్నిహితులే చంపి ఉండొచ్చని నల్గొండ డీఎస్పీ సుధాకర్ తెలిపారు.
ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ దారుణ హత్యకు గురవడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భోరున విలపించారు. శ్రీనివాస్ డెడ్‌బాడీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీనివాస్ హత్యకు నిరసనగా జిల్లా బంద్‌కి పిలుపునిచ్చారు. శ్రీనివాస్ హత్య వెనుక కుట్ర ఉందన్న కోమటిరెడ్డి శ్రీనివాస్‌కి ఎన్నోసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హత్య జరిగిందన్న కోమటిరెడ్డి ఆరోపించారు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ మొదటి నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన భార్య లక్ష్మికి కోమటిరెడ్డి కౌన్సిలర్ టికెట్ ఇప్పించారు. అంతేకాదు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం దక్కేలా చేశారు. తొలి ఏడాది కాంగ్రెస్‌లో ఉన్న బొడ్డుపల్లి దంపతులు ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే స్థానిక రాజకీయ కారణాలతో ఏడాది తిరగకుండా మళ్లీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి వచ్చేశారు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ నిన్న సాయంత్రం తిప్పర్తిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డితో కలిసి ఓ కార్యక్రమంలో చివరిసారిగా పాల్గొన్నారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక చిన్నపాటి గొడవను సర్దిచెప్పడానికి వెళ్లిన శ్రీనివాస్‌ను ఆయన సన్నిహితులే దారుణంగా హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో పాల్గొన్నవారితో పాటు, సంఘటన స్థలంలో గొడవకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ హత్యకు ఇంటి సమీపంలో జరిగిన గొడవ కారణమా లేక ఇతరత్రా పాత కక్షలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య వెనుక మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంతోపాటు టీఆర్‌ఎస్ పెద్దల హస్తముందంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీనివాస్‌ది ప్రభుత్వ మర్డరన్న కోమటిరెడ్డి బ్రదర్స్ బెదిరింపు ఫోన్ కాల్స్‌పై పోలీసులను ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.