కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా - రైల్వే జోన్ ఇచ్చేది లేదని ప్రకటించడంతో ఏపీ ప్రజలు కేంద్రంపై మండిపడుతున్నారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా సాధనా సమితి నేత శివాజీ కేంద్రానికి అల్టిమేట్టం జారీ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సెషన్స్ ముగిసే లోపు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయాలని లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా పీఎం మోడీపై తీవ్రంగా మండిపడ్డారు.
విభజన చట్టం హామీల్ని నెరవేరుస్తామని అధికారంలో వచ్చిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిందని ఆరోపించారు. ఏపీని నమ్మించి మోసం చేశారని , అది నమ్మకద్రోహమే అవుతుంది. అలా ఎవరైతే నమ్మించి మోసం చేస్తే వారిని మనిషివా , మోడీవా అని ప్రశ్నిద్దామా అని పిలుపునిచ్చారు.
అంతేకాదు నాడు ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అడిగిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు తానో సలహా ఇచ్చినట్లు గుర్తు చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు మోసం చేస్తారాని ఆ విషయాన్ని తాను గుర్తించి చంద్రబాబుకు చెప్పమన్నారు. కానీ చంద్రబాబు..వెంకయ్యానయుడిపై నమ్మకంతో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు చాలా తెలివైనవారు మోసం చేసిన వారిని తగిన బుద్ధి చెబుతారన్నారు. భావి తరాల కోసం తాము ఉద్యమిస్తున్నామని చెప్పారు
ఇదిలా ఉంటే శివాజీ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇన్ని రోజు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దక్షిణాది సొమ్ములతో ఉత్తరాదిని అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా శివాజీ ఆదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రం కేంద్రానికి పన్నులు కడుతుందో ..ఆ రాష్ట్రానికి నిధుల్ని ఖర్చుచేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మంత్రి పదవులకు రాజీనామా చేసిన టీడీపీ - బీజేపీ తో తెగతెంపులు చేసుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించేలా పోరాటం చేయాలని హితువు పలికారు. ఇక రైల్వే జోన్ విషయం లో రాజకీయం చేయడం సిగ్గు చేటు అని అన్న ఆయన ఇన్ని రోజులు రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ ..కొత్తగా రెండో రాజధానిగా రాయలసీమ అడగడం విడ్డూరమని అన్నారు.