తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధర ఆల్‌టైమ్‌ రికార్డు

Update: 2018-05-24 04:54 GMT

పెట్రో ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఆరేళ్ళ గరిష్టాన్ని దాటేశాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 81. 75 రూపాయలకు చేరగా..లీటరు డీజిల్ ధర 74.28 రూపాయలకు చేరింది. 2012 మే 23న హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 81. 75 రూపాయలు ఉండగా..ప్రస్తుత ధర ఆ రేటు దాటిపోయింది. డీజిల్ ధర కూడా ఏ రోజుకు ఆ రోజు రికార్డుల్ని సృష్టిస్తోంది. గత పదిరోజుల్లో చమురు సంస్థలు పెట్రోలుపై 2. 52 రూపాయలు పెంచగా...డీజిల్‌పై 2.39 రూపాయలు వడ్డించాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తర్వాత పది రోజులుగా రోజువారీ సవరణలతో ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రెండో స్థానంలో ఉండగా, డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ టాప్‌గా మారి రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.83.31 రూపాయలు ఉండగా....డీజిల్‌ ధర 75.60 రూపాయలకు చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 సెప్టెంబర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 83.07 రూపాయలతో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. తాజాగా ఏపీలో పెట్రోల్‌ ధర ఆ రికార్డును అధిగమించింది. 

2012 పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా...అప్పటి రికార్డును మించి ధర ఎగబాకడం విశేషం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు చుక్కల్ని తాకుతుంటే,,మోడీ సర్కారు మాత్రం పెరుగుదలకు తాత్కాలిక పరిష్కారం కాకుండా..దీర్ఘకాలిక పరిష్కారం చూపిస్తామని చెప్పుకొస్తోంది. తక్షణ ఉపశమనం కోసం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించుకోవాలని నిన్నటి మంత్రిమండలి భేటీ అభిప్రాయ పడింది. పెట్రోలు ధరల తగ్గించే కసరత్తు ఇప్పటికే మొదలయినా...ఏయే అంశాలను పరిశీలిస్తున్నదీ కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. ఆఖరుకి ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించేదీ లేనిదీ కూడా చెప్పలేదు. 

అయితే మూడు నాలు రోజుల్లో పెట్రో ధరలు దిగి వస్తాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రకటిస్తే..పెట్రో' ఉత్పత్తుల ధరలను తగ్గిస్తే, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు కష్టతరమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చే డబ్బుతో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని..పెట్రోలు, డీజిల్ ధరలపై సబ్సిడీ ఇస్తే, దాని ప్రభావం ఆయా పథకాలపై పడుతుందని అన్నారు.

Similar News