విజయసాయి వర్సెస్‌ బాబు మాటల తూటాల వెనుక రీజనైంటి?

Update: 2018-03-29 07:41 GMT

ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలన్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టిందా? అటు జగన్‌ను ఇటు మోడీని ఒకేసారి బద్నాం చేయాలన్న టీడీపీ ఎత్తుగడ రివర్స్‌ అయ్యిందా? జగన్‌ కంటే విజయసాయిరెడ్డినే చంద్రబాబు ఎందుకు టార్గెట్‌ చేశారు? ప్రధాని కార్యాలయంలో విజయసాయికి ఏం పనంటూ ప్రశ్నించడానికి కారణమేంటి? చంద్రబాబుకి వ్యతిరేకంగా ఢిల్లీలో విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతున్నారా? అసలు పీఎంవోలో ఏం జరుగుతోంది? విజయసాయి వర్సెస్‌ చంద్రబాబు మాటల తూటాల వెనుక రీజనైంటి? 

విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం నేతల నోళ్లలో ఎక్కువగా నానుతోన్న పేరు వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి కంటే విజయసాయిరెడ్డే ఇప్పుడు చంద్రబాబుకి, టీడీపీకి టార్గెట్‌గా మారారు. విజయసాయి ప్రతి కదలికపైనా నిఘా పెట్టడమే కాకుండా, అతని ప్రతి చర్యనూ గమనిస్తున్నారు. అసెంబ్లీలోనూ, టెలీకాన్ఫరెన్సుల్లో, పబ్లిక్‌ మీటింగ్స్‌లో ఇలా ఎక్కడ ఛాన్సు దొరికితే అక్కడ విజయసాయిరెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారు చంద్రబాబు. ఆర్ధిక నేరగాడు పలు కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయికి ప్రధాని ఆఫీసులో ఏం పని అంటూ విరుచుకుపడుతున్నారు. విజయసాయిని విజయ్‌మాల్యాతో పోల్చుతూ ఇటు వైసీపీని, జగన్‌‌ను అటు బీజేపీని, మోడీని టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశారు.

అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఘాటుగానే స్పందించారు. టీడీపీ దొంగల పార్టీ చంద్రబాబు దొంగల ముఠా లీడర్‌ అంటూ పరుష పదజాలం ఉపయోగించిన విజయసాయిరెడ్డి చంద్రబాబును గజదొంగ ఛార్లెస్‌ శోభరాజుతో పోల్చుతూ కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబునే కాదు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులపైనా విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరు దొంగలో తేల్చుకుందాం రమ్మంటూ సవాలు విసిరారు. సీఎం రమేష్‌, సుజనాచౌదరిపై ఘాటు ఆరోపణలు చేశారు. సుజనా పెద్ద ఆర్ధిక నేరగాడన్న విజయసాయి సీఎం రమేష్‌ భాగోతాన్ని రెండు రోజుల్లో బయటపెడతానన్నారు. 

విజయసాయిరెడ్డిపై గురిపెట్టడం ద్వారా ఇటు వైసీపీని, జగన్‌‌ను అటు బీజేపీని, మోడీని బద్నాం చేయాలన్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. విజయసాయి ఒక్కసారిగా బ్లాస్ట్‌ అయ్యి తీవ్ర ఆరోపణలు చేయడంతో టీడీపీ నేతలు కౌంటర్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చంద్రబాబు వర్సెస్‌ విజయసాయి అన్నంతగా మారిపోయాయి.

Similar News