ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదా పోరును జాతీయ స్థాయిలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారు. ఏపీ భవన్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. తొమ్మిది రోజులుగా అవిశ్వాసం నోటీసు ఇస్తున్నా అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనను సాకుగా చూపి సభను వాయిదా వేయడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో మూడు రోజులే పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నందున ఇవాళ, రేపులోగా అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలాగా చూడాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటున్న చంద్రబాబు పార్లమెంటులో ఎంపీలు, రాష్ట్రంలో ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం గురించి విపక్షాలకు వివరించనున్నారు. సుమారు 20కిపైగా పార్టీల నాయకులను కలుసుకుని రాష్ట్రానికి ఏవిధంగా అన్యాయం జరిగిందో వివరించనున్నారు. ఆయా పార్టీ నేతలను పార్లమెంటులోనే కలవనున్నారు.