అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ గడ్డపై కాలు మోపిన చంద్రబాబు... పార్లమెంట్ సాక్షిగా కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌లోకి అడుగు పెట్టడానికి ముందు ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి వెళ్తూ ప్రధాన ద్వారం దగ్గర మెట్లకు వంగి నమస్కరించారు.
రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటున్న చంద్రబాబు పార్లమెంటులో ఎంపీలు, రాష్ట్రంలో ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మోడీ సర్కారు ఏపీకి చేసిన అన్యాయం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం గురించి విపక్షాలకు వివరించనున్నారు. సుమారు 20కిపైగా పార్టీల నాయకులను కలుసుకుని రాష్ట్రానికి ఏవిధంగా అన్యాయం జరిగిందో వివరించనున్నారు. ఆయా పార్టీ నేతలను పార్లమెంటులోనే కలవనున్నారు.
స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు కేంద్రపై అవిశ్వాసానికి అనుకూలంగా ఆయా పార్టీల మద్దతు కూడగట్టనున్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఎన్‌సీపీ, తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకే, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, శివసేన, అకాలీదళ్, జనతాదళ్ (U), జనతాదళ్ (S), జేఎంఎం, ఆప్, IUML, INLD, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, లోక్ జనశక్తి తదితర పార్టీల నేతల్ని చంద్రబాబు కలవనున్నారు. 72 పేజీలతో ఓ నివేదిక వెంట తీసుకొచ్చిన చంద్రబాబు ఆ రిపోర్ట్‌ను ఆయా పార్టీల నేతలకు అందివ్వనున్నారు.
జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో సమావేశాల అనంతరం ఢిల్లీలో చంద్రబాబు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మోడీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ తమ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తున్న వైనాన్ని వివరించే అవకాశముందని తెలిసింది. అంతేకాక, తన పర్యటనలో భాగంగా ప్రతిపక్షాలకు విందును కూడా ఏర్పాటు చేయవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.