హస్తిన కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా నడుస్తోంది. ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నాలు నిర్వహిస్తుంటే, వైసీపీ ఎంపీ ఏకంగా పార్లమెంట్ భవనం పై కిఎక్కి నిరసనలు తెలిపారు. ఇలా పోటాపోటీగా ఆందోళనలు సాగిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ విషయంలో మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. టీడీపీ తనకు అన్యాయం చేసిన మిత్రుడి గురించి అల్లాడిపోతోంది. బీజేపీ తీరు మీద తీవ్రంగా మండిపడుతోంది. నేరుగా కాకకపోయినా పరోక్షంగానైనా ఘాటు వ్యాఖ్యలు సంధిస్తోంది. సమరానికి సిద్ధం అవుతోంది. కానీ వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తోంది. కేంద్రంలోని పెద్దలతో సఖ్యత నడుపుతూనే సామాన్య జనాలు ఆశిస్తున్న సమస్యపై మాత్రం సమర్థవంతంగా సాగుతున్నామని చెప్పుకోవడానికి తగ్గట్టుగా పథకరచన చేస్తోంది.
తాజాగా రైల్వే మంత్రి పియూష్ గోయెల్ తమకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని టీడీపీ నేతలు పెద్ద స్థాయిలో అలజడి రేపారు. తమకు ఇవ్వకపోగా ప్రత్యర్థి వైసీపీ ఎంపీలకు ఎలా అపాయింట్ మెంట్ ఇచ్చారంటూ నిలదీశారు. దాని మీద అమరావతిలో కూడా టీడీపీ అధినేత తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఏ2 నిందితుడికి ప్రధానమంత్రి సహా పెద్దలందరికీ నేరుగా అపాయింట్ మెంట్ దొరుకుతుందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి పియూష్ గోయెల్ ని వైసీపీ ఎంపీలు మేకపాటి, వర ప్రసాద్ కలిశారు. పలు సమస్యల మీద సానుకూల స్పందన వచ్చినట్టు ప్రకటించారు. కానీ టీడీపీ ఎంపీలు మాత్రం తనను అపాయింట్ మెంట్ అడగలేదని తాజాగా పియూష్ గోయెల్ వ్యాఖ్యానించారు. టీడీపీ అబద్ధాలు చెబుతోందంటూ మండిపడ్డారు. తనను కలవడానికిరాకుండా , అవకాశం ఇవ్వలేదనడం తగదంటూ వ్యాఖ్యానించారు.
దాంతో హస్తినలో టీడీపీ నేతల తీరు మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. టీడీపీ, బీ.జేపీ మధ్య బంధం తెగిపోతున్న దశలో ఇలాంటి పరిణామాలు ఆ పార్టీ పరువు తీస్తాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి అపాయింట్ మెంట్ కూడా అడక్కుండానే మీడియాలో రచ్చ చేయడం టీడీపీకి తగదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పియూష్ గోయోల్ వ్యాఖ్యల మీద స్పందించడానికి చాలామంది టీడీపీ నేతలు వెనకడుగు వేస్తున్న తీరు గమనిస్తుంటే ఆపార్టీ దాదాపుగా డిఫెన్స్ లో పడిపోయినట్టుగా ఉందని పరిశీలకుల అభిప్రాయం.