తమపై నివురు గప్పిన నిప్పులా ఉన్న ఏపీ ప్రజల్ని చల్లార్చేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ కు రూ. 1400కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఏపీకి ప్రత్యేకహోదా కావాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నాడు రాష్ట్ర విభజన సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వాగ్ధానాల్ని నెరవేర్చాలంటూ అటు పార్లమెంట్ లో ఇటు రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారు. కేంద్రంప్రవేశ పెట్టిన బిల్లులో ఏపీకి నిధులు కేటాయించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ - టీడీపీ లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అంతేకాదు నిన్నమొన్నటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కమలం పార్టీ నుంచి బయటకు వచ్చింది.
పార్టీల కంటే రాష్ట్రప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెబుతున్న చంద్రబాబు పీఎం మోడీపై మండిపడ్డారు. ఏపీ కావాల్సిన డిమాండ్ల కోసం తాను 29సార్లు ఢిల్లీవెళ్లినా తనను పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ అధినేత జగన్ తాను కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడతున్నానని అందుకు టీడీపీ మద్దతు పలకాలని కోరారు. జగన్ కోరికమేరకు చంద్రబాబు మద్దతు పలికి కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ - వైసీపీ లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యంలే ఆర్ధిక సమస్యలతో సతమతమవతున్న ఏపీకి కొంత ఊరట కలిగించేలా కేంద్రం రూ.1400కోట్ల నిధులు మంజూరు చేసింది. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 1795కోట్ల రుణం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం నాబార్డు ద్వారా రూ.1400కోట్ల రుణానికి అనుమతినిచ్చింది.
అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తరువాత ఎపి ప్రభుత్వం కోరిన విధంగానే మరో రూ. 300 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..."పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరైనా చేతులు పెట్టాలంటే వారి చేతులు కాలిపోతాయే తప్ప...ఎవరూ ఏమీ చేయలేరు...'' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.