బీజేపీ తీరు మార్చాల్సిన టైమొచ్చింది

Update: 2018-03-15 12:20 GMT

మొండి నమ్మకం.. బండతనం.. అనుకున్నది చేసే వ్యవహారం.. ఎంత మాత్రం మంచిది కాదన్న వాస్తవం.. ఇప్పటికైనా బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలిసి వచ్చి ఉంటుంది. ఎందుకంటే.. మోడీ మాయ అన్నిసార్లూ పని చేయదన్న సూత్రాన్ని.. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు తేల్చేయడం.. ముఖ్యంగా యూపీ లాంటి ప్రాంతాల్లో.. సమాజ్ వాదీ పార్టీకి, బహుజన్ సమాజ్ పార్టీ లాంటి వైరిపక్షం మద్దతు ఇవ్వడం చూస్తుంటే.. బీజేపీకి అక్కడ కాలం చెల్లిన విషయాన్ని ఎవరైనా అంగీకరించక తప్పదు.

అదొక్కటే కాదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కూడా.. ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. త్వరలోనే.. ఈ రెండు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే.. కర్ణాటకలోనూ ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. దక్షిణ భారతంలో పాగా వేయాలంటే కర్ణాటకలో గెలుపు.. ఇప్పుడు బీజేపీకి అత్యవసరం. అలాగే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోయినా.. తక్కువ ఫలితాలు సాధించినా.. అది బీజేపీకి ఎదురుగాలే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ తెరపైకి తెస్తుందనడంలో ఎలా సందేహం లేదు.

అందుకే.. ఇప్పుడు బీజేపీ నేతలు తమ పట్టు నిలబెట్టుకోవాలంటే.. ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన సమయం వచ్చిందన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. లేదంటే.. ఇప్పటికి మామూలు స్థాయిలో జరిగిన నష్టం.. మరింత భారీగా జరిగేందుకు అవకాశం పెరుగుతుంది. గతంలో.. వాజ్ పేయి లాంటి నాయకుడే.. మళ్లీ అధికారంలోకి రాలేకపోయారన్న వాస్తవాన్ని కూడా బీజేపీ నాయకులు గుర్తుకు తెచ్చుకుని.. ఇప్పటికైనా జన ఆమోదం ఉండే కార్యక్రమాలవైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.. అని జనం అంటున్నారు.

Similar News