డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు మాణిక్యవరప్రసాద్ నామినేషన్ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకర్‌రావు, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. వాస్తవానికి ఈ ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో డొక్కా మాణిక్యవరప్రసాదే ఉన్నారు.
అయితే జనవరిలో టీడీపీని వదిలిపెట్టిన ఆయన.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడంతో ఈరోజు డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. సంఖ్యా బలం దృష్ట్యా ఈ స్థానం వైసీపీకే దక్కుతుంది. కాగా 2014లోనే ఆయన వైఎస్సార్‌సీపీలో చేరాల్సి ఉన్నా, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అప్పట్లో టీడీపీలో చేరారు.