వైఎస్ జగన్ ‘రూ. 500 కోట్లతో కట్టించిన’ రుషికొండ ప్యాలెస్ చిత్రాలు చూశారా?

ఈ రుషికొండ ప్యాలస్‌ను వందల కోట్ల ప్రజాధనంతో నిర్మించారని వారన్నారు. ఈ భవనం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Update: 2024-06-16 13:09 GMT

వైఎస్ జగన్ ‘రూ. 500 కోట్లతో కట్టించిన’ రుషికొండ ప్యాలెస్ చిత్రాలు చూశారా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన హిల్ రిసార్ట్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఏపీ పర్యాటకరంగం అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనానికి అధికారిక లెక్కల ప్రకారం రూ. 365 కోట్లు ఖర్చయింది. కొన్ని నెలల కిందట అప్పటి టూరిజం శాఖ మంత్రి రోజా ఈ భవనాన్ని సందర్శించారు. ఆ తరువాత ఇప్పటివరకూ అందులోకి ఎవరినీ అనుమతించలేదు.


కాగా, ఆదివారం ఉదయం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర ఎన్.డీ.ఏ పక్ష నేతలు ఈ భవనాన్ని తెరిపించి పరిశీలించారు. ఆ భవనంలోకి అడుగుపెట్టిన తరువాత తాము ఆశ్చర్యపోయామని వారు తెలిపారు. తాడేపల్లి నుంచి విశాఖకు షిఫ్ట్ అయిపోదామని భావించిన జగన్ తన విలాసవంతమైన జీవనశైలికి తగ్గట్లుగా ఈ రుషికొండ ప్యాలస్‌ను వందల కోట్ల ప్రజాధనంతో నిర్మించారని వారన్నారు. ఈ భవనం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఈ ఫోటోలు చూస్తే ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసానికి ప్రజాధనాన్ని ఏ స్థాయిలో ఖర్చు చేశారో అర్ధమవుతుంది. ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, మిరమిట్లు గొలిపే షాండిలియర్స్, అత్యున్నత స్థాయి ఫర్నీచర్, విశాలమైన స్నానాల గదులు చూస్తుంటే అదొక రాజమహలు అనిపించకమానదు.

2021లో హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి 365 కోట్లతో టూరిజం శాఖ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ, అది పూర్తయ్యేప్పటికి దాని ఖర్చు రూ. 500 కోట్లు దాటిందని చెబుతున్నారు. ఇందులో బాత్‌రూమ్ నిర్మాణానికే కోట్లు ఖర్చు చేశారని, అందులో ఏర్పాటు చేసిన విలాసవంతమైన బాత్ టబ్ ఖరీదే 26 లక్షలు అని తెలుగుదేశం పార్టీ తన ఎఫ్బీ అకౌంటులో ఆరోపించింది.


ఇది సద్దాం హుసేన్ బంగళా మాదిరిగా, గాలి జనార్దన్ రెడ్డికి బెళ్ళారిలో ఉన్న విలాస భవనం లాగా ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వ్యక్తిగత నివాసం కోసం జగన్ మోహన్ రెడ్డి 500 కోట్ల ప్రజాధనాన్ని దీని కోసం ఖర్చు చేశారని ఆయన చెప్పారు.

మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిస్తే, విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని, విశాఖ నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పారు. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆయన పార్టీని తీవ్రంగా తిరస్కరించారు. ఎన్.డీ.ఏ కూటమికి బంపర్ మెజారిటీ కట్టబెట్టారు.

Tags:    

Similar News