వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో సినిమా తారల పొలిటికల్ స్క్రీన్ ప్లే, సన్నివేశాలను రక్తికట్టిస్తోంది. తానెప్పుడో క్లాప్ కొట్టి పార్టీలో ఎంటరైతే, మొన్నమొన్న సీన్‌లోకి ఎంటరైనవారిని, అందలమెక్కిస్తారా అంటూ, ఒక నటుడు తనలో యాంగ్రీ సీన్‌ను బయటకు తెచ్చే ప్రయత్నం చేశాడు. మరో యాక్టర్ డైలాగ్‌ను కూడా ఖండఖండాలుగా సెన్సార్ చేశాడు. ఇంతకీ వైసీపీలో పోసాని కృష్ణ మురళి, స్టోరి, స్క్రీన్ ప్లే సారాంశమేంటి? ఆయన మాటల వెనక అంతుచిక్కని కథనమేంటి?
పోసాని కృష్ణమురళి. పరిచయం అక్కర్లేని సినిమా రచయిత, దర్శకుడు, నటుడు. వైసీపీ నాయకుడు కూడా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మొదటి నుంచీ సమర్థిస్తూ వస్తున్న నటుడిగా పోసానికి పేరుంది. ఒకవైపు చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేస్తూ, జగన్ దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నారు. ఎన్నికల టైంలోనూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ, బాబును తూర్పారబట్టారు. ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలొచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత పోసాని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. సర్జరీ తర్వాత మొదటిసారి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. అయితే, మునుపటిలా లేవు ఆయన వ్యాఖ్యలు. ఆ కామెంట్స్ వెనక కథేంటి అన్న యాంగిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది ఇప్పుడు.
పోసాని జగన్‌పై అసంతృప్తిగా ఉన్నారా?
జగన్ తీసుకున్న కొన్ని నిర్నయాలను పరోక్షంగా తప్పుపట్టారా?
ఈ కామెంట్ల వెనక అసలు కథేంటి?
ఈ ప్రశ్నలకు రాజకీయవర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశానని చెప్పిన పోసాని ఆ విషయం కంటే ఎక్కువగా పలు కీలక అంశాలపై రియాక్ట్ కావడం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పోసాని వ్యాఖ్యల వెనక అనేక చర్చలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం జగన్. మరో నటుడు అలీకి ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పోసాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వైఎస్ జగన్ పార్టీ స్థాపించిన సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో కేవలం తాను, రోజా మాత్రమే ఉన్నామని, ప్రముఖంగా ప్రస్తావించారు పోసాని కృష్ణమురళి. ఈ రకంగా తాను మొదటి నుంచి జగన్‌తో ఉన్నాననే విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు.
అంతేకాదు, మీ తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి మంచి పదవులే దక్కాయి కదా అని మీడియా అడిగితే, మరింత డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు పోసాని. తన కంటే వారే పార్టీ కోసం ఎక్కువగా పని చేశారని పార్టీ నాయకత్వం భావించిందేమో అంటూ, పార్టీ నిర్ణయాల తీరుపై పరోక్షంగా తన అసంతృప్తిని పోసాని వెళ్లగక్కారన్న చర్చకు ఆస్కారమేర్పడింది.
అంతేకాదు, వైసీపీలో ఉన్న మరో నటుడు పృథ్వీ చేసిన కీలక వ్యాఖ్యలను కూడా పోసాని ఖండించడం పట్ల, కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సీఎం కావడం సినిమావాళ్లకు ఇష్టంలేదనే వ్యాఖ్యలను తాను అంగీకరించనని దగ్గుబాటి సురేశ్ బాబు జగన్‌ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కూడా కోరారని పోసాని వ్యాఖ్యానించారు. అంటే, పృథ్వీ వ్యాఖ్యలను ఈజీగా కొట్టివేయడం ద్వారా, అతనికంటే తానే సీనియర్‌నని చెప్పుకునే ప్రయత్నం చేశారని చర్చ జరుగుతోంది.
మొత్తానికి పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలను చూస్తుంటే, తెలుగు సినీ పరిశ్రమలో కొందరికి ఇస్తున్న పదవుల పట్ల, అసంతృప్తితో రగిలిపోతున్నారని అర్థమవుతోంది. అందరికంటే పార్టీలో ముందు నుంచి ఉంటున్న తనను విస్మరిస్తున్నారనే అసంతృప్తి ఆయనలో కనిపిస్తోందనే భావనపై, చర్చ జరుగుతోంది. చూడాలి, పోసాని కామెంట్స్‌పై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో? ఎలాంటి పదవి ఆఫర్ చేస్తుందో?