AP Politics: చంద్రబాబు అరెస్ట్‌తో రసవత్తరంగా ఏపీ పాలిటిక్స్
AP Politics: రాజమండ్రి జైలు వేదికగా కొలిక్కివచ్చిన పొత్తుల అంశం
AP Politics: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ శరవేగంగా మారిపోతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతామని, బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై టీడీపీతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామని తేల్చేశారు పవన్.
పొత్తులపై పవన్ ప్రకటనతో టీడీపీలోనూ నూతన ఉత్సాహం కనిపిస్తోంది. అయితే టీడీపీ, జనసేనల పార్టీ క్యాడర్ గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. మరో వైపు రెండు పార్టీలు ఇప్పటివరకు ఉమ్మడి కార్యాచరణతో చేసిన కార్యక్రమాలు అతి తక్కువగా ఉన్నాయి.
మరి టీడీపీతో అలాంటి ఇబ్బంది జనసేన కార్యకర్తలకు వస్తుందా అనడంలో సందిగ్ధం లేకపోలేదు. టీడీపీ క్యాడర్‌తో సఖ్యతగా ఉండేందుకు సేనాని మాటలను జనసేనికులు పాటిస్తారా లేదా అనేది డౌట్. మరో వైపు గతంలో ఉన్న వైరం.. పొత్తులకు ఇబ్బంది అవుతుందా అనే చర్చ జరుగుతోంది.
మొత్తంగా ఏపీలో 2014 కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టబోతున్న సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వ అధికారిక ప్రకటన రావడమే మిగిలింది. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని ఓడించగలవా? ఓటు చీలకుండా చూస్తే వైసీపీని ఓడించేందుకు అవకాశాలున్నాయని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి.