Visakha Steel Plant: ఇదిగో లాభాలు...ప్రైవేటీకరణ ఎందుకు?
Visakha Steel Plant: గత నెలలో స్టీల్ ప్లాంట్ లాభాలు సాధించి, రికార్డు స్థాయిలో ఉత్పత్తిని నమోదు చేసింది.
Vizag Steel Plant: కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని, అందుకే ప్రైవేట్‌పరం చేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. కార్మిక సంఘాలు స్టీల్‌ప్లాంట్ గేట్ ఎదుట బైఠాయించి, గత కొన్ని రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నాయి.
పనితోనే సమాధానం చెబుతామంటున్న కార్మికులు...
ఇదిలా ఉంటే.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్చిలో స్టీల్ ప్లాంట్ లాభాలు సాధించి పెట్టింది. రికార్డు స్థాయిలో ఉత్పత్తిని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు18 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయం తీసుకున్న కేంద్రానికి, తమ పనితీరుతో సమాధానం చెబుతున్నారు కార్మికులు. స్టీల్ ప్లాంట్ చరిత్రలో రికార్డు స్థాయిలో 20 వేల 400 టన్నుల ఉత్పత్తిని పరిశ్రమ సాధించింది. ఇదే ఉత్పత్తి కొనసాగితే ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 3 వందల కోట్ల లాభం దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్తుందని నిపుణులు అంటున్నారు.
ఉత్పత్తి, అమ్మకాల్లో రికార్డులు...
ఉత్పత్తి, అమ్మకాలలో విశాఖ స్టీల్‌ప్లాంట్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఉక్కు టర్నోవర్ 18 వేల కోట్లు సాధించామని, కర్మాగారం చరిత్రలోనే రెండో అత్యధికమని సీఎండీ పీకే రథ్ వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎండీ గత ఆర్థిక ఏడాదిలో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదయిందని, ఈ 4 నెలల్లో 740 కోట్ల నికర లాభం నమోదైందని తెలిపారు. మార్చిలో 7లక్షల 11వేల టన్నుల ఉక్కు 3వేల 300కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. కర్మాగారం చరిత్రలో ఈ మార్చిలో అత్యధిక ఆదాయం వచ్చిందని పీకే రథ్ స్పష్టం చేశారు.
కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి...
ఒక్కరోజులో బ్లాస్ట్ ఫర్నేస్‌లో అత్యధికంగా 20 వేల 400 టన్నుల హాట్ మెటల్‌ను కార్మికులు ఉత్పత్తి చేసారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పాదన ప్రారంభమయ్యాక.. ఒక్కరోజులో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఇదే అత్యుత్తమ హాట్ మెటల్ ఉత్పాదన అని కార్మికులు అంటున్నారు. ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరంలేదని కార్మిక సంఘాల నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీరు మారకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులు.