Tirumala: తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు

Tirumala: వైకుంఠ ద్వారాన్ని సుందరంగా అలంకరణ చేసిన టీటీడీ

Update: 2023-01-02 01:13 GMT

Tirumala: తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు

Tirumala: వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేశాక అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు దర్శనాలను ప్రారంభించారు. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

ముక్కోటి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో 300, ఆఫ్‌లైన్‌లో టోకెన్లు పొందారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నిర్దేశిత టోకెన్లు కలిగిన భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. ఇక వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇందుకోసం పది టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఒక టన్ను కట్‌ ఫ్లవర్స్‌ వినియోగించారు.

తిరుమలకు వచ్చే వీఐపీల కోసం ప్రత్యేకంగా శ్రీ పద్మావతి అతిథిగృహం ప్రాంతంలోని సన్నిధానం, వెంకట కళా నిలయం వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అక్కడే వసతి, దర్శన పాసులను జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది టీటీడీ. 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటుగా 2వేల 300 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ప్రత్యేక భద్రత ప్రర్యవేక్షణ కోసం ఏడుగురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు తిరుమలలో 11 రోజుల పాటు విధులు నిర్వహించనున్నారు.

Full View


Tags:    

Similar News