TTD Trust Board: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవే...
TTD Trust Board: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది.
TTD Trust Board: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో ఈ వేసవిలో భక్తుల రద్దీపై సమీక్షించామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి నైవేద్యాలకు 12 రకాల ప్రకృతి సాగు ఉత్పత్తుల ధరలపై కమిటీ నియామకానికి ఆమోదం తెలిపినట్టు వివరించారు. అలిపిరి వద్ద గోడౌన్లు, భవనాల ఆధునికీకరణకు రూ.32 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ గుడి ఆధునికీకరణకు రూ.3 కోట్లకు టెండర్లు పిలుస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
టీటీడీ విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదానికి కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. జూన్ 15 కల్లా శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని సమావేశంలో వెల్లడించారు. ఫారిన్ కరేన్సి మార్పిడిపై కేంద్రం విధించిన 3 కోట్ల జరుమానను రద్దు చేయాలని హోంశాఖ దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.