పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభించిన టీటీడీ
TTD: భక్తులకు అందుబాటులో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు, కెమికల్ లేని ఉత్పత్తుల విక్రయంపై భక్తుల హర్షం.
TTD: నమామి గోవింద బ్రాండ్ పేరుతో పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలను టీటీడీ ప్రారంభించింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పబ్లికేషన్ కేంద్రం వద్ద పంచగవ్య ఉత్పత్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి విక్రయిస్తు్న్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలిపేందుకు పంచగవ్యాలతో పలు రకాల గృహ అవసరాల ఉత్పత్తులను టీటీడీ తయారు చేసింది. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక సహకారంతో హెర్బల్ సోప్, ధూప్ చూర్ణం, అగర్‌బత్తీ, హెర్బల్ షాంపు, హెర్బల్ టూత్ పౌడర్, విభూది, నాజిల్ డ్రాప్స్, హెర్బల్ ఫేస్ ప్యాక్, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, ధూప్ చూర్ణం సాంబ్రాణి కప్, ధూప్ కోన్, ధూప్ స్టిక్స్, గో అర్కం, పిడకలు, కౌడంగ్ లాగ్ అనే 15 రకాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది టీటీడీ.
పంచభూతాల సాక్షిగా ఐదు హోమగుండాల్లో ఎంతో పవిత్రంగా సిబ్బంది విభూది తయారు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, టీటీడీ అనుబంధ ఆలయాల్లో దేవతామూర్తులు అలంకరించిన పుష్పాలను డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్ర పటాలు, పెండెంట్‌ల విక్రయాలను టీటీడీ ప్రారంభించింది. అగర్‌బత్తిల తరహాలోనే ఈ ఉత్పత్తులను భక్తులకు అందించాలని భావిస్తోంది. టీటీడీ సహజ సిద్ధంగా పంచగవ్య ఉత్పత్తులను కెమికల్ లేకుండా తయారు చేసి విక్రయించడం ఆనందంగా ఉందని భక్తులు అంటున్నారు.