ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో భేటీ..!
* రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ
Pawan Kalyan: ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో భేటీ కానుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు ప్రధాని టూర్‌ను సక్సెస్ చేసి ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ, బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ లోపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటెన్షన్‌ను తనవైపు డైవర్ట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. సాయంత్రం 5 గంటలకు విశాఖకు చేరుకోనున్న పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ కానుండటం ఉత్కంఠ రేపుతోంది. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు పవన్ మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవల వైజాగ్ పర్యటనలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని పవన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇప్పటం గ్రామంలోనూ తన పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన తీరును మోడీకి వివరించే చాన్స్ ఉంది.
2014 ఎన్నికల్లో మోడీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ పోటీకి దూరంగా ఉంటూ బీజేపీ, టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. 2020 నుంచి బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉండగా రాష్ట్ర బీజేపీ, పవన్‌కు మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పవన్‌తో సమావేశం కావడం ఆ తర్వాత జనసేనాని సంకేతాలు కొంత దుమారం రేపాయి. రానున్న ఎన్నికలకు కేంద్ర పెద్దల నుంచి రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పిన పవన్ ప్రధాని మోడీ, ఇతర పెద్దలంటే అభిమానమే అన్నారు. కానీ, ఊడిగం మాత్రం చేయబోనని ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ, పవన్ భేటీ రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, పవన్ సమావేశం తర్వాత జరుగుతున్న ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఎక్కడైతే తన పర్యటనకు అడ్డంకులు ఎదురయ్యాయో అదే విశాఖలో ప్రధానితో పవన్ భేటీ కానుండటం జనసేన వర్గాల్లో జోష్ నెలకొంది. తాజా పరిణామాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. విశాఖ గర్జన రోజు అడ్డు తగిలిన పవన్ మళ్లీ ప్రధాని పర్యటన నేపథ్యంలో మరోసారి అటెన్షన్‌ను డైవర్ట్ చేస్తున్నారని వైసీపీ హైకమాండ్ గుర్రుగా ఉంది. ప్రధాని మోడీతో పవన్ భేటీపై పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.