Pawan Kalyan: జాతీయ నేతగా పవన్ కళ్యాణ్.. మహరాష్ట్ర ప్రచారం సూపర్ హిట్
Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం పనిచేసిందని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సరళి చెబుతోంది.
Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రచారం పనిచేసిందని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సరళి చెబుతోంది. మహాయుతి అభ్యర్థుల విజయానికి పవన్ ప్రచారం దోహదపడిందని ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేపట్టిన పూణె, బల్లార్‌పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ నియోజకవర్గాల్లో మహాయుతి విజయం సాధించింది. కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ స్థానాల్లో మహాయుతి జెండా పాతడం చర్చనియాంశంగా మారింది. ప్రచారం సందర్భంగా మహారాష్ట్రలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు.
కొన్ని నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఎంత ఘన విజయాన్ని నమోదు చేసిందో చూశాం. కూటమి విజయంలో, ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఎన్టీయే కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్‌కు బీజేపీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొన్నిచోట్ల ప్రచారం నిర్వహించాలని బాధ్యతలు అప్పగించింది. అమిత్ షా, మోదీ లాంటి అగ్రనేతల సూచనతో పవన్ మహారాష్ట్రకు వెళ్లి మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.
పవన్ మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రసంగాలు సైతం వాడివేడిగా సాగాయి. పవన్ సభకు జనాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ కూటమి ఆవశ్యకతను చెబుతూనే.. కాంగ్రెస్ కూటమిని విమర్శించారు. పవన్ మరాఠీలో మాట్లాడుతూ తనదైన ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ అక్కడి వారిని ఆకట్టుకున్నారు. పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అన్ని చోట్లా బీజేపీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించడమే కాకుండా భారీ మోజారిటీలు సాధించారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపునకు కృషి చేసిన పవన్.. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో తనదైన రీతిలో ప్రచారం నిర్వహించి మహాయుతి కూటమి అభ్యర్థుల విజయానికి కారణమయ్యారు. దీంతో మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల విజయంలో పవన్ కళ్యాణ్ పాత్రపై నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మరో కొత్త నాయకుడిగా ఆవిష్కృతం అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.