వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పాదయాత్రతో ప్రభంజనం మోగించారు. నారా చంద్రబాబు నాయుడు సైతం, పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర, అఖండ విజయాన్ని అందించింది. ఇప్పుడు ఇదే ఒరవడిలో లోకేష్ బాబు కూడా యాత్రకు సిద్దమవుతున్నారట. అయితే అందరిలా కాకుండా, కాస్త డిఫరెంట్‌గా, మరో టైప్ టూర్‌తో ప్రజలతో దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఏంటా యాత్ర?
నారా లోకేష్. చంద్రబాబు తనయుడు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ. అన్నింటికీ మించి నారావారి వారసుడు. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్న నాయకుడు. 2014లో అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం, 2019 ఘోర ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు ఆత్మస్థైర్థాన్ని కోల్పోతున్నాయి. టీడీపీలో కీలక నాయకులను బుట్టలో వేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అందుకే నారాలోకేష్, పార్టీని ఆ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి, యాత్ర అనే అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్నారట. అదే సైకిల్ యాత్ర.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్లకు పైగా టైముంది. కానీ అంతలోపు పార్టీని కాపాడుకోవడం తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నారట లోకేష్. ఎన్నికల టైంకు పాదయాత్రకు శ్రీకారం చుట్టినా, ఇప్పటికిప్పుడు పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి సైకిల్ యాత్ర బెటరని భావిస్తున్నారని, టీడీపీలో చర్చ జరుగుతోంది. సైకిల్, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు. అదే సైకిల్ మీద ఊరూరా తిరుగుతూ, జనాలను, కార్యకర్తలను పరామర్శిస్తూ, పలకరిస్తూ పోతే, సైకిల్ యాత్ర సూపర్ హిట్టవుతుందని అనుకుంటున్నారట తెలుగుదేశం శ్రేణులు.
ఎన్నికల ఘర్షణలు, ఎన్నికల తర్వాత గొడవలతో చాలామంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారని ఇప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, టీడీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని కూడా వారు ఆరోపణలు సంధిస్తున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, బాధిత కుటుంబాలను ఇప్పటికే పరామర్శ చేశారు. చాలా జిల్లాల్లో పర్యటించి, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చారు. ఆర్థికంగా ఆదుకుంటామని, కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామి ఇచ్చారు. అయితే చంద్రబాబు ఒక్కరే తిరిగితే, చాలా టైం పడుతుందని భావిస్తున్న లోకేష్, తాను కూడా ఏదో రకంగా ప్రజల వద్దకు వెళ్లాలని అనుకుంటున్నారట. అందుకు సైకిల్ యాత్ర మేలని ఆలోచిస్తున్నారట.
లోకేష్ బాబు సైకిల్ యాత్ర ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉందట. త్వరలో చంద్రబాబు చెవిలో వేసి, అప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారట లోకేష్. బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సైకిల్ మీద రయ్‌రయ్ మంటూ వెళ్లేందుకు సిద్దమవుతున్నారట లోకేష్.
నాయకుడు ఎవరైనా ప్రజల్లో నిత్యం వుంటేనే, నాయకుడు అవుతాడు. పవర్‌లో ఉన్నంత కాలం, మంత్రిగా సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు లోకేష్. ఆ తర్వాత ఎన్నికల టైంలో జనాల దగ్గరకు వెళ్లారు తప్ప, ప్రజా సమస్యలపై నేరుగా ఎలుగెత్తింది లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ ఆలోచిస్తున్నారట. సైకిల్ యాత్ర ద్వారా వీలైనన్ని ప్రాంతాలను చుట్టేస్తే, ప్రజా నాయకుడిగానూ మద్దతు లభిస్తుందని భావిస్తున్నారట.
ఇప్పటికే ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు లోకేష్. గ్రామవాలంటీర్లు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కరెంటు కోతలపై వ్యంగ్యబాణాలు విసురుతున్నారు. ఎన్నికల తర్వాత నేరుగా మీడియా ముందుకు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ, టీడీపీ వాణిని వినిపిస్తున్నారు. ఇప్పుడు డైరెక్టుగా కార్యకర్తల దగ్గరకు వెళ్లి, వారిలో జోష్ నింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అతిత్వరలో లోకేష్ సైకిల్ యాత్ర మొదలవుతుందని, టీడీపీలో చర్చ జరుగుతోంది.