Somasila Project: సోమశిల ప్రాజెక్టు నుండి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

Somasila Project: పెన్నా పరివాహక ప్రాంతాన్ని ముంచెత్తిన వరద ప్రవాహం

Update: 2021-11-23 10:36 GMT

సోమశిల ప్రాజెక్ట్ (ఫైల్ ఇమేజ్)

Somasila Project: తెగిపోయిన చెరువులు, గట్లు తెగిన కాలువలు. ఇళ్లల్లోంచి బయటకు రాని వరద నీరు. నేల పాలైన లక్షలాది రూపాయల గృహోపకరణాలు. చేతికందే దశలో చేజారిపోయిన పంట పొలాలు. సాగుకు సిద్ధమైన వరి చేలలో కిలోమీటర్ల మేర ఇసుక మేటలు. ఇది నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం.

నెల్లూరులో భారీ వర్షాలు కురిశాయి. దంచికొట్టిన వానలకు సోమశిల ప్రాజెక్టు నుండి లక్షల కూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. కుండపోత వర్షాలకు జిల్లాలోని ఉప నదుల వరద ప్రవాహం ఏకమై పెన్నా పరివాహక ప్రాంతాన్ని ముంచేశాయి. దీంతో దాదాపు 50 గ్రామాలు నీట మునిగాయి. జాతీయ రహదారులు చెరువులను తలపించగా ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.

పెన్నా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయారు. బాహ్య ప్రపంచానికి వారందరూ దూరమయ్యారు. తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు నెలకొన్నాయి. కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనారోగ్యం పాలైన వారి పరిస్థితి ఆగమ్యగోచరం అన్నట్లుగా మారింది. రెండ్రోజులుగా వర్షాలు ఆగడంతో యుద్ధ ప్రాతిపదికన అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. రాకపోకలను పున:రుద్ధరించారు.

రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వానలు, వరదలు వేలాది ఎకరాల్లో పంటను, నారు మళ్లను నీట ముంచింది. వందలాది ఎకరాల్లో ఇసుకమేటలు వేసింది. అంతేకాదు వదర ప్రభావిత ప్రాంతాల్లో సారవంతమైన సాగు భూములు సేద్యానికి పనికి రాని విధంగా తయారయ్యాయి. ఇక ఆకు, కూరగాయాల తోటలు, చిన్న పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చే 5వేల పరిహారం చెల్లించడం ఎంతవరకు సమంజసమని బాధితులు వాపోతున్నారు.

Tags:    

Similar News