Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమలలో ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 3 నుంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.

Update: 2024-10-01 06:50 GMT

Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల‌ను పుర‌స్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో కడిగారు.

ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందంటున్నారు.

తిరుమలలో ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 3 నుంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఈనెల 4న ధ్వజారోహణం, 8న గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఈనెల 7న రాత్రి 11 గంటల నుంచి 8న అర్ధరాత్రి వరకు ఘాట్ రోడ్లులో ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.

Tags:    

Similar News