Kadiyam Trees: ముఖేష్ మెచ్చిన మొక్కలు.. ఒక్కో మొక్క రూ.25 లక్షలు!
Kadiyam Trees: నర్సరీలకు తూర్పుగోదావరి జిల్లా కడియం పెట్టింది పేరు.
Kadiyam Trees: నర్సరీలకు తూర్పుగోదావరి జిల్లా కడియం పెట్టింది పేరు. విశాలవంతమైన భవనం సువిశాలమైన గార్డెన్లో ఈ మొక్కలు ఉంటే వచ్చే అందమే వేరు. అలాంటి అందమైన మొక్కలు ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ నివాసంలో కొలువుదీరనున్నాయి.
ప్రముఖ వ్యాపార దిగ్గజం అంబానీ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ నివాసంలో కడియం మొక్కలు కనువిందు చేయనున్నాయి. కడియం మండలం వీరవరం రోడ్డులో ఉన్న గౌతమీ నర్సరీ యజమాని మార్గాని వీరబాబు ఈ మొక్కలను సప్లై చేశారు. రెండేళ్ల క్రితం ఈ మొక్కలను స్పెయిన్ దేశం నుంచి ఓడలో ప్రత్యేక కంటైనర్ ద్వారా తీసుకువచ్చారు. అంబాని కుటుంబ సభ్యుల కోరిక మేరకు గౌతమీ నర్సరీ గోదావరి మట్టి, నీళ్లతో ఆ మొక్కల ప్రత్యేక పోషణ చేపట్టారు. ఆలీవ్ ట్రీ సాధరణ రూపానికి భిన్నంగా ఆకృతిని మార్చడానికి సుమారు రెండేళ్ల సమయం పట్టింది. ప్రత్యేక శ్రధ్ద వహించి సృష్టించిన తర్వాత ఒక్కో మొక్కకు అయిన ఖర్చు 25 లక్షలకు చేరింది.
సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్‌లో గౌతమీ నర్సరీల్లో మొక్కల ఆకృతిని ఆకర్షనీయంగా మార్చడం చూసిన రిలయన్స్ సంస్థ ప్రతినిధులు రెండేళ్ల క్రితమే గౌతమీ నర్సరీకి ఆర్డర్ ఇచ్చారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ముఖేష్ అంబానీ నూతనంగా నిర్మించిన ఇంటి సమీపంలోని 250 ఎకరాల్లో సృష్టించిన ప్రకృతి వనంలో ఈ మొక్కలను ఏర్పాటు చేయనున్నారు.