బీజేపీ బలపడకుండా జగన్‌ వ్యూహాలు..వైసీపీలోకి భారీగా నేతలను ఆహ్వానించాలని ప్లాన్?

Update: 2019-08-03 03:34 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఇప్పుడు బీజేపీ రూపంలో, రాబోయే కాలంలో కాబోయే శత్రువు కనపడుతోంది. అమిత్‌ షా, రాంమాధవ్‌ వంటి కరడుగట్టిన వ్యూహకర్తలు, రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు బీజేపీ విస్తరణను అడ్డుకోవడంపైనే ఇద్దరు అధినేతల తక్షణ కర్తవ్యంలా కనపడుతోంది. ఈ విషయంలో జగన్‌, ఎవరి ఊహకూ అందని ఒక వ్యూహానికి పదునుపెడుతున్నారు. తన స‌్వభావానికి విరుద్దమైనప్పటికీ, బీజేపీకి చెక్‌ పెట్టేందుకు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా వ్యూహం?

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు రకరకాల వ్యూహాలు వేస్తోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, ఏకంగా అమిత్‌ షా అనేక అస్త్రాలకు పదునుపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదగాలని, కంకణం కట్టుకుంది కాషాయ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం దారుణంగా ఓడింది. అయితే చంద్రబాబుకు వయసు మీదపడుతుండటం, లోకేష్‌ వారసత్వం అంతగా క్లిక్‌ కాకపోతుండటంతో, ప్రత్యామ్నాయ నాయకత్వం లేక, తెలుగుదేశం చతికిలపడుతోంది. ఒకవైపు యువకుడు, బలమైన నాయకుడైన జగన్‌ను ఎదుర్కోవాలంటే, అందుకు దీటైన లీడర్‌, చంద్రబాబు తర్వాత ఎవరూ కనపడ్డం లేదు. దీంతో నాయకత్వం సంక్షోభం తెలుగుదేశంలో ప్రధానంగా కనపడుతోంది. రాబోయే పదేళ్లలో టీడీపీ మూలాలే చెదురుతాయా అన్నట్టుగా, ప్రత్యర్థి పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న ఈ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకోవాలని అటు జనసేన, ఇటు బీజేపీ రకరకాల వ్యూహాలు వేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రెండాకులు ఎక్కువే చదివింది కాబట్టి, టీడీపీని రీప్లేస్ చేసి, వైసీపీకి ఢీకొట్టాలనుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ, ముందుగా టీడీపీ, కాంగ్రెస్ సీనియర్లను పార్టీలోకి లాగాలనుకుంటోంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా క్షేత్రస్థాయిలోని క్యాడర్‌ తమవెంటే వస్తుందని ఆలోచిస్తోంది. వైసీపీ ఎలాగూ వలసలకు గేట్లు మూయడంతో, మిగిలింది తమ పార్టీయేనని బలంగా నమ్ముతోంది బీజేపీ. మిగతా పార్టీల్లోని నాయకులు కూడా ఇదే ఫీలవుతున్నారు.

మొదట్లో టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ, వైసీపీని పెద్దగా విమర్శించని బీజేపీ, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ పాలన చూస్తుంటే, ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందని, బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్ యుద్ధానికి సిద్దమన్న సంకేతమిచ్చారు. కొందరు బీజేపీ నేతలైతే టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీనే విమర్శిస్తున్నారు. అయితే బీజేపీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పెద్దగా నోరు తెరిచింది లేదు. కాషాయ పార్టీతో మాటకు మాట వ్యవహారమంటే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో ఢీకొట్టడమేనని జగన్‌ ఆలోచన. అందుకే ఈ విషయంలో బీజేపీ ఎంతగా కవ్విస్తున్నా, వైసీపీ మాత్రం సంయమనం పాటిస్తోందని అర్థమవుతోంది. అయితే, బీజేపీ విమర్శలపై జగన్‌ పార్టీ సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఆ పార్టీని ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై సీరియస్‌గానే ఆలోచిస్తున్నారు వైసీపీ నేతలు. బీజేపీని కట్టడి చేసేందుకు జగన్‌ మదిలో ఒక వ్యూహం మెదులుతోందని, పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే వలసలకు గేట్లు తెరవడం.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడకుండా ఎలాంటి వ్యూహాలకు పదునుపెట్టాలన్నదానిపై తాజాగా కేసీఆర్, జగన్‌లు చర్చించారు. అమిత్‌ షా విస్తరణ స్ట్రాటజీలను అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదని, కాస్త దృష్టిపెట్టాలన్న నిర్ణయానికొచ్చారు. కాషాయ పార్టీ దూకుడును కట్టడి చేయాలన్న ఆలోచనల్లో భాగమే, వైసీపీలోకి ఇతర పార్టీల నాయకులకు రెడ్‌ కార్పెట్ వేయడం. తద్వారా బీజేపీలోకి వెళ్లకుండా చేయడం.

Full View

Tags:    

Similar News